సీఎస్ ను ఎందుకు బదిలీ చేశారు?

అమరావతి: ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను ప్రభుత్వం బదిలీ చేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సుబ్రహ్మణ్యం బదిలీ వ్యవహరంపై ప్రతిపక్ష టీడీపీ.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ‘ప్రిన్సిపాల్ సెక్రటరీపై చీఫ్ సెక్రటరీ షోకాజు నోటీసులు ఇస్తే… ప్రిన్సిపాల్ సెక్రటరీ… చీఫ్ సెక్రటరీనే బదిలీ చేయించారు.. శుభాకాంక్షలు ’ అంటూ కేశినేని నాని వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు.

ఎల్వీ సుబ్రహ్మణ్యంని ఎందుకు బదిలీ చేశారో సీఎం జగన్ సమాధానం చెప్పాలని టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. సీఎస్ బదిలీని ఖండిస్తున్నామన్నారు. సమర్థుడైన అధికారి అని సీఎం జగన్ సీఎస్ ఎల్వీని పొగిడి ఇప్పుడు ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంపై తమకు ప్రేమ కాదని, సీనియర్ ఆఫీసర్ కనుక ఆయనపై ఉన్న గౌరవంతో స్పందిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవడం వల్ల ఐఏఎస్ అధికారుల మధ్య సమన్వయం లోపించిందని ఆరోపించారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆశలు ఐదు నెలల్లోనే ఆవిరైపోయాయని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.