సుజిత్ కోసం రజనీ ప్రార్థన!

చెన్నై: తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా మనప్పారైలో రెండేళ్ల చిన్నారి సుజిత్ విల్సన్ బోరుబావిలో పడిన ఘటనపై సినీనటుడు రజనీకాంత్ స్పందించారు. ఆ చిన్నారి క్షేమంగా రావాలని ప్రార్థనలు చేశారు. సుజిత్ సురక్షితంగా ప్రాణాలతో తిరిగి రావాలని కోరుతూ ప్రార్థించాలని తన అభిమానులకు సూచించారు. సుజిత్ ప్రాణాలతో వస్తాడనే తాను ఆశిస్తున్నానని చెప్పారు. దీపావళి పండుగ సమయంలో ఈ ఘటనను తనను కలచి వేసిందని రజినీకాంత్ అన్నారు. సుజిత్ ను బయటకు తీసుకువచ్చేందుకు సహాయక సిబ్బంది.. యంత్రాల సాయంతో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని, వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రజనీ సూచించారు.

దీపావళి పండుగను పురస్కరించుకుని వందలాది మంది రజినీకాంత్ అభిమానులు ఆదివారం ఉదయం చెన్నైలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రజినీకాంత్ నిండు నూరేళ్లు జీవించాలని కోరుతూ ప్రార్థనలు చేశారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన తన అభిమానులను రజినీకాంత్ నిరాశకు గురి చేయలేదు. వారికి చిరునవ్వుతో పలకరించారు. అభివాదం చేస్తూ, చాలాసేపు గడిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

‘ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు. బోరుబావిలో చిక్కుకున్న రెండేళ్ల చిన్నారి సుజిత్‌ క్షేమంగా బయటకు రావాలని ప్రార్థిస్తున్నాను. బాబును బయటకు తీసుకువచ్చేందుకు యంత్రాల సాయంతో సహాయక సిబ్బంది కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను’ అని రజనీ పేర్కొన్నారు.

శుక్రవారం సాయంత్రం 5.30కి ఇంట్లోంచీ ఆడుకుంటూ వెళ్లిన సుజిత్ బయటకు వెళ్లి బోరుబావిలో పడ్డాడు. సుమారు 70 అడుగుల లోతు మేర బోరుబావిలో చిక్కుకుని పోయిన రెండేళ్ల సుజిత్ను.. బయటకు తీసేందుకు రెండు రోజులుగా సహాయక బృందాలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. బోరుబావికి సమాంతరంగా గుంతను తవ్వుతున్న సమయంలో మధ్యలో రాళ్లు ఎదురయ్యాయి. వాటిని తొలగించడానికి బోర్లను వేసే యంత్రాలను తెప్పించారు. గుట్టగా ఉన్న రాళ్లను పగులగొడుతూ భూమిని తొలుస్తున్నారు. బాలుడిని సజీవంగా వెలికి తీయడానికి ప్రయత్నిస్తున్నారు.