హైదరాబాద్: దిశ హత్యోదంతం నిందితుల ఎన్‌కౌంటర్‌ను తొలుత సమర్థించిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ యూటర్న్ తీసుకున్నారు. ఎన్‌కౌంటర్‌పై విచారం వ్యక్తం చేశారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో నారాయణ వ్యాఖ్యలను పలువురు సభ్యులు తప్పుబట్టడంతో పార్టీకి, ప్రజలకు నారాయణ బహిరంగ క్షమాపణలు తెలిపారు. ఎన్‌కౌంటర్‌పై తాను చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయమని, ఎన్కౌంటర్లకు పార్టీ వ్యతిరేకం అని, పార్టీ విధానాలకు భిన్నంగా చేసిన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించారు. ఈ మేరకు వివరణ ఇస్తూ ఓ వీడియోను విడుదల చేశారు.
‘హైదరాబాద్ ఎన్‌కౌంటర్‌పై పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో చర్చించారు. ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ పార్టీ తీర్మానం కూడా చేసింది. అందువల్లే నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను. అదే సమయంలో తన వ్యాఖ్యల విషయంలో పార్టీకి, ప్రజా సంఘాలకు క్షమాపణలు కూడా తెలియజేస్తున్నాను’ అని ఆ వీడియోలో నారాయణ పేర్కొన్నారు.
‘దిశ’ హత్యాచార నిందితులు ఆరిఫ్, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులులను పోలీసులు.. చటాన్‌పల్లి వద్ద క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడే పారిపోడానికి ప్రయత్నించగా.. ఎన్కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఎన్కౌంటర్ ను స్వాగతిస్తున్నట్లు నారాయణ వ్యాఖ్యానించారు.