టాప్ స్టోరీస్

గ్రానైట్ ఎవరి “దారి” వారిదే…!

Share

ప్రకాశం జిల్లాలో రాజకీయ శాసన కర్త, కర్మ, క్రియ అన్ని గ్రానైట్ వ్యాపారులే. రెండు దశాబ్దాలకు పైగా రాజకీయ రథంపై ఊరేగుతూ ఇష్టమొచ్చినట్టు తవ్వకాలు సాగించారు. ఇప్పుడు పాపం పండింది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్వారీల పాపపు చిట్టాను బయటకు తీసి ఫైన్ వేశారు. “ప్రతి క్వారీ లీజులు, లెక్కలు, పత్రాలు, కొలతలు, అమ్మకాలు, పన్నులు” అన్నిటినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి రూ. 1914 కోట్లు ఫైన్ వేశారు. ఇది రాజకీయ కోణంలో జరిగినా, ఉద్దేశ పూర్వకంగా జరిగిన ఉల్లంఘనలు ఉల్లంఘనలే.
వీటిని చెల్లించకుండా తప్పించుకునేందుకు ఆయా కంపెనీలు రకరకాల ఎత్తులు వేస్తున్నాయి. వీటిలో కనీసం సగానికి పైగా వారి తప్పిదాలు ఉండగా, కొన్ని అంతర ఉద్దేశాలు ఉన్నాయి. ఒక్కో క్వారీ వారు ప్రస్తుతం వారికి వేసిన ఫైన్ నుండి తప్పించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

కొన్ని కీలక క్వారీలు ఇలా…!

  • మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు గోల్డెన్ గ్రానైట్స్, శ్రీ వాసవి, వాసవి, జ్యోతి అనే పేరిట క్వారీలు, లీజులు నిర్వహిస్తున్నారు. వీరి అన్ని కంపెనీలకు కలిపి రూ. 290 కోట్లు వరకు ఫైన్ వేశారు. ఇది అనైతికమని, దురుద్దేశం పూర్వకంగా వేశారని, మళ్ళీ తనిఖీలు చేసి లెక్కించాలని శిద్ధా కోర్టుకి వెళ్లి స్టే తెచ్చుకున్నారు. తాత్కాలికంగా ఉపశమనం లభించింది. ఇప్పుడు పార్టీ మారడం ద్వారా, మళ్ళీ తనిఖీల్లో తనకు అనుకూలంగా నివేదికలు తెప్పించుకోడవం ద్వారా పూర్తిగా బయట పడాలని యోచిస్తున్నారు. రాజకీయంగా ఏమి చేయాలనే విషయమై తర్జనభర్జన పడుతున్నారు. వీటిలో గోల్డెన్ గ్రానైట్స్ కి చెందిన ఒక కీలక ఫైల్ గనులశాఖ కార్యాలయం నుండి మాయమవ్వడం గమనార్హం.
  • శిద్ధా సూర్యప్రకాశరావు, శిద్ధా హనుమంతరావులు ఆపిల్, చంద్రిక పేరిట క్వారీలు నిర్వహిస్తున్నారు. వీరికి రూ. 145 కోట్లు ఫైన్స్ వేశారు. వీరిద్దరూ ఇటీవల వైసిపిలో చేరిపోయారు. ఆ తనిఖీలు తప్పు, కొన్ని పరిశీలనా చేయలేదు మళ్ళీ చెక్ చేయాలని ప్రభుత్వానికి విన్నవించుకుని… కాస్త రాజకీయంగా బయటపడాలని చూస్తున్నారు. నిజానికి ఈ ఇద్దరూ ఇప్పటి వరకు రాజకీయంగా ఏ పార్టీలోనూ చేరలేదు. కానీ తనిఖీలు, ఫైన్లు తర్వాతనే వైసిపి కండువా కప్పుకున్నారు.
  • శిద్ధా కుటుంబంలోనే గ్రానైట్ రంగంలో ఆరితేరిన మరో వ్యక్తి శిద్ధా వెంకటేశ్వరరావు. కృష్ణసాయి, మణికంఠ పేరిట క్వారీలు నిర్వహిస్తున్నారు. ఈయన కొన్నాళ్ళు బీజేపీలో పనిచేసి తర్వాత అనధికారికంగా టీడీపీలోచేరి ఒంగోలు డెయిరీ చైర్మన్ గా పని చేశారు. గత ఎన్నికలకు ముందు వైసిపి ఒంగోలు టికెట్ ఆశించారు. ఈ సంస్థలకు దాదాపు రూ. 420 కోట్లకి పైగా ఫైన్ వేశారు. ఈయన కోర్టుకి వెళ్లి తాత్కాలికంగా స్టే తెచ్చుకున్నారు. అక్కడి క్వారీల్లో అత్యధిక ఆదాయం వచ్చే వాటా ఈయనకు ఉంది. అందుకే కొంత అనధికార లావాదేవీల ద్వారా బయటపడాలని ఈయన భావిస్తున్నట్టు తెలుస్తుంది. రాజకీయంగా తనకు ప్రాధాన్యత ఇస్తే వైసిపిలో చేరేందుకు ఈయన సిద్ధంగా ఉన్నారు.
  • ఇక పెరల్ క్వారీలకు రూ. 204 కోట్లు ఫైన్ వేశారు. పెరల్ మినరల్స్ పేరిట (పల్లవ , రెడ్ ) అనే రెండు క్వారీలను రాజా నిర్వహిస్తున్నారు. ఈయన రాజకీయాలకు అతీతంగా ఉంటున్నారు. ఇటీవల ఈయన క్వారీల్లో కొంత వాటిని అధికార పార్టీలో ఓ కీలక వ్యక్తి బంధువులకు వాటాగా ఇచ్చారు. అనంతరం తన క్వారీలను మళ్ళీ తనిఖీ చేయాలని, ఫైళ్లు చూసి మరోసారి నివేదికలు చూసి, ఫైన్ వేయాలని కోరుతూ గనుల శాఖకు లేఖ రాశారు. ఓ ప్రభుత్వ పెద్ద ద్వారా ఈయన బయటపడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.
  • ఇక అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కిషోర్ గ్రానైట్స్, కామేపల్లి గ్రానైట్స్ పేరిట క్వారీలు నిర్వహిస్తున్నారు. అర్చన గ్రానైట్స్ లో సగం వాటా ఉంది. ఈయన క్వారీలకు రూ. 280 కోట్లు వరకు ఫైన్ వేశారు. ప్రస్తుతానికి కోర్టు ద్వారా స్టే తెచ్చుకుని బయటపడ్డారు. తనకున్న రాజకీయ అనుభవం, ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత పరిచయాలతో కొంత మేరకు బయటపడేందుకు చూస్తున్నారు. లేని పక్షంలో కొద్దీ రోజులు వేచి చూసి రాజకీయ నిర్ణయానికి సిద్ధమవుతున్నారని సమాచారం.
  • చీరాల ఎమ్మెల్యే కారణం బలరాం ఆయన వర్గీయులకు కెబి రాక్స్ పేరిట క్వారీలు ఉన్నాయి. వీరి సంస్థలకు రూ. 33 కోట్లు ఫైన్ వేశారు. ఇది జరిగిన నెల రోజులకు బలరాం వైసీపిలో చేరిపోయారు. ప్రస్తుతానికి ఈ లీజుకి సంబంధించిన విచారణ, ఫైన్ విషయం పక్కకు వెళ్ళింది.

ఒక్కటిగా వెళ్ళలేరు…!

నిజానికి గ్రానైట్స్ కి సంబంధించి ఏ సమస్య వచ్చిన ఆసోసియేషన్ ద్వారా పరిష్కరించుకునే వారు. కానీ ఈ తనిఖీలు, ఫైన్స్ విషయంలో మాత్రం సంఘం లేదు, అసోసియేషన్ లేదు. ఎవరికీ వారే పరిష్కరించుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ వైఖరే అని వినిపిస్తుంది. నిజానికి గ్రానైట్ లో పట్టుకోవాలె కానీ చాల లోపాలు ఉంటాయి. ఈ క్వారీల ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంలో సగం కూడా రావట్లేదు. కొలతలు తేడా చూపించడం, అర్ధరాత్రి వేళ లెక్కల్లో లేని తరలింపులు అనేకం ఉంటాయి. ఇవన్నీ ప్రభుత్వం కట్టడి చేస్తే ఈ వ్యాపారాలు కూడా రూ. వందల కోట్ల ఆస్తుల నుండి సాధారణ వ్యాపారులుగా మారిపోతారు. కానీ కొన్ని రాజకీయ, సొంత ప్రయోజనాల నిమిత్తం ఇటు ప్రభుత్వ పెద్దలు అవకాశాలు వెతుక్కోవడం, మరోవైపు క్వారీల యజమానులు కూడా తమ తప్పులు ఒప్పుకుని రాజకీయంగా సరెండర్ అవుతుండడంతో చాల వరకు అక్రమాలు బయటకు రావడం లేదనేది వాస్తవం.


Share

Related posts

తెలంగాణలో మరో దారుణ పరువు హత్య

Siva Prasad

ఎయిరిండియా విమానంపై పిడుగు!

Mahesh

సిబిఐ మొరపై రేపు సుప్రీంలో విచారణ

Siva Prasad

Leave a Comment