డెడ్‌లైన్ ముగిసింది.. నెక్ట్స్ ఏంటి?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

ఉద్యోగాల్లో చేరేందుకు ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం విధించిన గడువు మంగళవారం అర్ధరాత్రితో ముగిసింది. ప్రభుత్వ డెడ్‌లైన్ ను ఆర్టీసీ ఉద్యోగులు పట్టించుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 360 మంది కార్మికులు మాత్రమే విధుల్లో చేరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో, ఆర్టీసీ సమ్మెపై ప్రగతి భవన్ లో రావాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ, రవాణాశాఖ ఉన్నతాధికారులతో కేసీఆర్ సమావేశమయ్యారు. సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, హైకోర్టు ముందు ఉంచాల్సిన అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గడువు ఇచ్చినా కార్మికులు విధుల్లో చేరకపోవడంతో సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.

విధుల్లో చేరని కార్మికులను ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగంలో చేర్చుకోవద్దని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గడువులోగా కార్మికులు విధుల్లో చేరకపోతే.. మిగిలిన ఐదువేల రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని.. అప్పుడిక తెలంగాణలో ఆర్టీసీ ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్టీసీ ఎండీ ఇచ్చిన రిపోర్ట్‌ అర్ధరహితంగా ఉందని, కోర్టును తప్పుదోవ పట్టించేలా ఉందని ఇటీవల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎండీ దాఖలు చేసిన అఫిడవిట్‌కు అసెంబ్లీలో మంత్రి చెప్పిన వాటికి విరుద్ధంగా ఉన్నాయని ఈ నెల 6 లోపు పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ అధికారులతో చర్చిస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు గురువారం(నవంబర్ 7) సీఎస్‌తోపాటు ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి, రవాణాశాఖ కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్‌తోపాటు ఆర్టీసీ అధికారులందరూ కోర్టు ముందు హాజరుకానున్నారు.

మరోవైపు కార్మికుల సమ్మె 33వ రోజుకు చేరింది. ఆర్టీసీ పరిరక్షణ కోసం కార్మికులు చేస్తున్న సమ్మెకు విపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, విప్లవ సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. సమ్మెపై కార్మికులు తమ పట్టు వదల్లేదు.. పోరాటం నుంచి వైదొలగలేదు. ఉద్యోగాలు పోతాయని, కుటుంబాలు రోడ్డున పడతాయని సాక్షాత్తూ ముఖ్యమంత్రి హెచ్చరించినా.. ఉద్యమబాట వీడలేదు. అన్నింటికీ తెగించి అసాధారణ ఐక్యతను, సమష్టి ఉద్యమ స్ఫూర్తిని చాటుతున్నారు.

ముషీరాబాద్ బస్ డిపో వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా వామపక్షాల ఆధ్వర్యంలో ముషీరాబాద్ బస్ డిపో ముట్టడి జరిగింది. ఈ సందర్భంగా నేతలు డిపో ఎదుట బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకట్ రెడ్డి, కార్యకర్తలు, పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. వామపక్షాల నిరసన నేపథ్యంలో డిపో వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కరీంనగర్ ఆర్టీసీ డిపోలో మెకానిక్‌గా పనిచేస్తున్న కరీంఖాన్ అనే కార్మికుడు గుండెపోటుతో బుధవారం మృతి చెందాడు. కరీంఖాన్ మృతి పట్ల ఆర్టీసీ కార్మికులు సంతాపం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కార్మికులకు ఉద్యోగాల్లో చేరేందుకు ఇచ్చిన గడువు ముగియడంతో ఆందోళ ఉదృతం చేస్తామని ఆర్టీసీ జేఏసీ నేతలు స్పష్టం చేశారు.