ఒక్కరొక్కరుగా 9మంది జంప్

హైదరాబాదు, మార్చి 20 : తెలంగాణ కాంగ్రెస్ నుండి ఒక్కరొక్కరుగా హస్తానికి హ్యాండ్ ఇచ్చి కారు ఎక్కి గులాబి కండువాలు కప్పుకుంటుండటంతో ప్రధాన ప్రతిపక్షహోదా కూడా కోల్పోయే పరిస్థతి ఏర్పడింది. ఆ పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా జారిపోయే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌కు ముందు నుండే కాంగ్రెస్ పార్టీ నుండి చేరే ఎమ్మెల్యేలకు అధికార టిఆర్ఎస్ తలుపు బార్లా తెరిచి రెడ్ కార్పెట్ పరిచింది. ఒక్కరొక్కరుగా ప్రారంభం అయి కేవలం మూడు నెలల వ్యవధిలో  తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి గులాబి కండువాలు కప్పుకున్నారు.

నియోజకవర్గంలో అభివృద్ధి కోసం తాము పార్టీ మారుతున్నామనీ, వ్యక్తిగత స్వార్థం ఏమీలేదని పార్టీ మారే ఎమ్మెల్యేలు చెబుతుండగా, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ అధికార టిఆర్ఎస్ తమ పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొనుగోలు చేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావులు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని విధంగా దెబ్బకొడుతున్నారు. అధికార పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంపై పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్‌పి నేత మల్లు భట్టువిక్రమార్కలు అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద నిరసనలు సైతం చేశారు.

డిసెంబర్ నెలలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపి తదితర పార్టీలు మహాకూటమిగా ఏర్పడి పోటీ చేసిన విషయం తెలిసిందే. 99 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ పోటీ చేయగా కేవలం 19మంది స్థానాల్లోనే విజయం సాధించారు.  గెలుపొందిన 19మందిలో ఖమ్మం జిల్లా నుండి రేగ కాంతారావు (పినపాక), అత్రం సక్కు (అసిఫాబాద్),  హరిప్రియ నాయక్ (ఇల్లందు), కందల ఉపేంద్రర్ రెడ్డి (పాలేరు), వనమా వెంకటేశ్వరరావు (కొత్తగూడెం), రంగారెడ్డి జిల్లా నుండి పి సబితా ఇంద్రారెడ్డి (మల్లేశ్వరం),   దేవిరెడ్డి సుధీర్ రెడ్డి (ఎల్ బి నగర్),  నల్లగొండ జిల్లా నుండి చిరుమర్తి లింగయ్య (నకిరేకల్లు)లు టిఆర్‌ఎస్ పార్టీలో చేరిపోగా బుధవారం కొల్లూపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి టిఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు.

బుధవారం హర్షవర్థన్ రెడ్డి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌తో బేటీ అయ్యారు. టిఆర్ఎస్‌లో చేరేందుకు సంసిగ్ధత వ్యక్తం చేస్తూ, అవసరమైతే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని తెలిపారు.

ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్‌పి నేత భట్టి విక్రమార్కతో పాటు జలాల సురేందర్ (ఎల్లరెడ్డి) దుద్దుళ్ల శ్రీధర్ బాబు(మంథని),  తూర్పు జయప్రకాష్ రెడ్డి (సంగారెడ్డి), రోహిత్ రెడ్డి (తాండూర్), కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి(మునుగోడు), గండ్ర వెంకట రమణారెడ్డి(భూపాలపల్లి), అనసూయ ధన్సారీ (ములుగు), పొడెం వీరయ్య(భద్రాచలం)లు (పది మంది) మాత్రమే కాంగ్రెస్‌లో మిగిలారు. 19మందిలో  తొమ్మిది మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడి వెళ్లడంతో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోనుంది.