ప్రభుత్వ ఏర్పాటుపై వీడని చిక్కుముడి!

ముంబై: మహారాష్ట్రలో ఫ్రభుత్వం ఏర్పాటుపై ఇంకా ఉత్కంఠ తొలగలేదు. సీఎం పదవి ఎవరు చేపడతారన్నదానిపై బీజేపీ, శివసేన పార్టీల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. 50-50 ఫార్ములాకు కట్టుబడి తమకు కూడా సీఎం పదవి ఇవ్వాలని శివసేన పట్టుబడుతుండటం… దీనికి బీజేపీ ఒప్పుకోకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్ఠంభన ఏర్పడింది.  ఎన్నికల ముందు తమకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండకపోతే ఎంతకైనా తెగిస్తామని శివసేన హెచ్చరిస్తోంది. ఎన్సీపీ, కాంగ్రెస్ లతో కలసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

మరోవైపు 54 సీట్లను గెలుచుకున్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో శివసేన నేతలు భేటీ కావడం ఉత్కంఠను మరింత పెంచింది. ఎన్సీపీ, కాంగ్రెస్ తో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఎన్నికల్లో ప్రజలు ఏం కోరుకున్నారో… దానికే తాము కట్టుబడి ఉంటామని శరద్ పవార్ స్పష్టం చేశారు. ఎన్సీపీ ప్రతిపక్షంలో ఉండాలని ప్రజలు తీర్పునిచ్చారని… వారి అభీష్టం మేరకు తాము ప్రతిపక్ష స్థానంలోనే కూర్చుంటామని చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీ-శివసేనలకు ప్రజలు మెజార్టీ స్థానాలను కట్టబెట్టారని… కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది? వారిద్దరూ చిన్నపిల్లల్లా వ్యవహరిస్తున్నారంటూ పవార్ విమర్శించారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేశాయి. 288 అసెంబ్లీ స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56 సీట్లను గెలుచుకున్నాయి. అయిదుగురు ఇండిపెండెంట్లు మద్దతివ్వడంతో శివసేన బలం 61కి పెరిగింది. ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాల్లో గెలుపొందాయి. బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలన్న డిమాండ్ ను శివసేన తీసుకొచ్చింది. అయితే, బీజేపీ మాత్రం ఇందుకు సుముఖంగా లేదు.

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై మరో వారం రోజులు తర్వాత కూడా ఇంలాంటి ప్రతిష్టంభన కొనసాగితే నవంబరు 7 నుంచి రాష్ట్రపతి పాలన విధించే అవకాశముందని బీజేపీ నేత సుధీర్ ముంగతివార్ వ్యాఖ్యానించారు. నవంబరు 8న ప్రస్తుత మహారాష్ట్ర అసెంబ్లీ గడువు కాలం ముగియనుంది. ఎన్నికల ఫలితాలు విడుదలై ఎనిమిది రోజులు గడుస్తున్నా ఇంకా ప్రభుత్వ ఏర్పాటుపై ఎలాంటి పురోగతి లేని నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు  ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీంతో మహారాష్ట్రలో రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి.