(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
కరోనా లాక్ డౌన్ ముగిసిపోతుంది. వేసవి సెలవులలో విహార యాత్రలకు వెళ్లి హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకున్న వారి కలలు కల్లలు అయ్యాయి. ప్రతి ఏటా వేసవి సెలవులలో వేలాది మంది వారి పిల్లలతో బంధువుల ఇళ్లకు, విహారయాత్రలకు వెళుతుంటారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తుండటంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వివాహ వేడుకలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా మహమ్మారి భయంతో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
చైనా దేశంలో పురుడు పోసుకున్న కరోనా వైరస్ ఆ దేశాన్ని అతలాకుతలం చేయడంతో పాటు ప్రపంచంలో ని అన్ని దేశాలకు విస్తరించింది. భారత దేశంలో కరోనా వైరస్ కట్టడి చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విధించిన లాక్ డౌన్ మే 3వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే.
అయితే వారం రోజుల క్రితం నుండి ఈ నెల 15వ తేదీ నుండి ప్రజలు ప్రయాణాలు యధావిధిగా చేసుకునేందుకు ఇండియన్ రైల్వే శాఖ, ఏపిఎస్ ఆర్ టీ సి టికెట్ ల ఆన్ లైన్ అడ్వాన్స్ బుకింగ్, కౌంటర్ల ద్వారా టికెట్ రిజర్వేషన్ సదుపాయం కల్పించడంతో ప్రయాణికుల్లో అసలు చిగురించాయి. 14వ తేదీతో లాక్ డౌన్ ఎత్తి వేస్తారని సంబర పడ్డారు. దాదాపు 39 లక్షల మందికి పైగా ప్రజలు రైల్వే టికెట్ లను, వేలాది మంది బస్సు టికెట్ లను అడ్వాన్స్ రిజర్వేషన్ చేయించుకున్నారు. అయితే లాక్ డౌన్ ను మే 3వ తేదీ వరకు కొనసాగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడంతో ఈ నెల 15వ తేదీ నుండి మే 3వ తేదీ వరకు రిజర్వేషన్ చేసుకున్న టికెట్లన్నింటిని అటు రైల్వే శాఖ, ఇటు ఆర్ టీ సి టికెట్ రిజర్వేషన్ లను క్యాన్సిల్ చేసింది. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి పూర్తి డబ్బులు వారి ఖాతాల్లో జమ అవుతాయని, కౌంటర్లలో బుక్ చేసుకున్న వారు అక్కడే డబ్బులు వెనక్కి తీసుకోవచ్చని రైల్వే శాఖ ప్రకటించింది.
కరోనా ప్రభావం ప్రముఖ పుణ్య క్షేత్రాల పైనా పడింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయం తో సహా రాష్ట్రలోని అన్ని ఆలయాలలో భక్తుల సందర్శన నిలుపుదల చేశారు. తిరుమల క్షేత్రాన్ని ప్రతి ఏటా ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ నెలల్లో రోజుకి సగటున లక్షన్నర మంది దర్శించుకొంటారు అని అంచనా. రోజుకు 5 కోట్లకు పైగా ఆదాయం వస్తుంటుంది. తిరుపతి ఆలయ చరిత్రలో ఇన్ని రోజుల పాటు ఆలయాన్ని మూసివేయడం ఇదే ప్రథమం అని తెలుస్తున్నది.