ముంబై: ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టార్ సింగర్ గా మారిపోయింది రాణు మండాల్. ఆమె గాత్రం లతా మంగేష్కర్‌ను పోలి ఉండటంతో సోషల్ మీడియా పుణ్యమా అని ఈమె పాడిన పాట ఓ రేంజ్లో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు రాణు గొంతుకి ఫిదా అయ్యారు. అంతే కాకుండా బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా రాణు పాటకు మంత్ర ముగ్ధులయ్యారు. రైల్వే స్టేషన్ లో పాటలు పాడే రాణు ప్రతిభ ఇప్పుడు బాలీవుడ్‌కి పాకింది. బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేష్ రేష్మియా ఓ అడుగు ముందుకేసి `హ్యాపీ హర్డీ అండ్ హీర్`చిత్రంలో పాట పాడే అవకాశాన్ని కల్పించారు. రాణు మండాల్ విషయం తెలుసుకున్న బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఆమె పాటలు విని ఫిదా అయ్యారు. దాంతో ఏకంగా ఆమెకు రూ. 55 లక్షల విలువైన ఇంటిని బహుమతిగా ఇచ్చారని ప్రచారం జరిగింది.
అయితే ఇదంతా ఫేక్ న్యూస్ అని రాణాఘాట్ కు చెందిన అమ్రా శోభాయ్ షోయితన్ క్లబ్ సభ్యులు అంటున్నారు. రాణు మోండాల్ ప్లాట్ ఫామ్ పై పాడుతుండగా వీడియో తీసి వాట్సాప్, ఫేస్ బుక్ లో ప్రచారం చేసింది ఈ క్లబ్ సభ్యులే. సల్మాన్ ఖాన్ ఆమెకు ఇల్లును కానుకగా ఇచ్చినట్టు తమకు ఎలాంటి సమాచారం లేదని, ఇది సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఫేక్ న్యూస్ మాత్రమేనని క్లబ్ సభ్యుడైన వికీ బిశ్వాస్ తెలిపారు. గత కొద్ది రోజులుగా రాణుపై సోషల్ మీడియా వేదికగా వివిధ రకాల రూమర్స్ జరుగుతున్నాయన్నారు. రాణు రూ.15 లక్షల విలువైన ఓ కారు కొన్నట్లు, హిందీ బిగ్ బాస్ షో నుంచి పిలుపు అందుకున్నట్లు, హిమేష్ తన చిత్రంలో పాట పాడినందుకు రూ.50 లక్షలు ఇచ్చారనే ప్రచారం కూడా జరుగుతోందన్నారు.
https://youtu.be/wVvBxXhH6Xo