NewsOrbit
సెటైర్ కార్నర్

ఆనియన్ ఛాలెంజ్!

(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం)

న్యూఢిల్లీ :  దేశంలో పలు చోట్ల ఉల్లి ధర సెంచరీ దాటింది. కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాల్లోనైతే డబుల్ సెంచరీ కొట్టింది. ఉల్లి ధరలను నియంత్రించడం, వినియోగదారులకు అందించడం పెను సవాళ్లుగా మారాయి. దీంతో అటు కేంద్రప్రభుత్వమూ, ఇటు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలూ తక్షణ చర్యలకు ఉపక్రమించాయి. ఇందుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాల మేరకు ఉల్లిపాయలను ఇకపై స్థానిక పోలీసు స్టేషన్లలోనే విక్రయిస్తారు. మద్యం అమ్మకాలలాగే ఉల్లి అమ్మకాలు కూడా ప్రభుత్వ ఆజమాయిషీలోనే సాగుతాయి. ఒక్కో కుటుంబానికి నెలకు కిలో ఉల్లిపాయలు మాత్రమే ఇస్తారు. అది కూడా ఆధార్ కార్డు చూపించి కొనుగోలు చేయవలసి ఉంటుంది. ఎవరైనా తప్పుడు సమాచారంతో ఉల్లిని కొనుగోలు చేస్తే భారీ జరీమానా విధిస్తారు. ఉల్లి కోసం వచ్చే పౌరులు విధిగా క్యూపద్ధతి పాటించాలి. ఎక్కడైనా తోపులాటలైతే పోలీసులు లాఠీలకు పని చెబుతారు. అదుపులోకి రాకపోతే బాష్పవాయు ప్రయోగం చేస్తారు. ఉల్లి అమ్మకాలు సాగే చోట్ల తప్పనిసరిగా అంబులెన్సులు అందుబాటులో ఉంచుతారు. అలాగే ఉల్లిదొంగతనాలు నమోదవుతున్న నేపథ్యంలో అలాంటి విద్రోహక చర్యలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారు. ఉల్లి దొంగతనం ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలనీ, నేరం జరిగిన ప్రదేశంతో సంబంధం లేకుండా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనీ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. దేశవ్యాప్తంగా ఉల్లి కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.

ఉల్లి సరఫరా అన్నది ఇప్పుడు శాంతిభద్రతల సమస్యగా పరిణమించింది కనుక ఉల్లి కొనుగోలు పేరుతో అల్లర్లు సృష్టించేవారిపై ఒక కన్నేసి ఉంచాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పోలీసులను ఆదేశించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా సంఘ విద్రోహులను బైండోవర్ చేయాలని కూడా ఆయన సూచించారు. వినియోగదారులెవరూ ఆందోళన పడనక్కర్లేదనీ, ‘ఉల్లిబంధు’ పథకం తెచ్చి అందరినీ తప్పక ఆదుకుంటాననీ ఆయన భరోసా ఇచ్చారు. ‘కళ్యాణలక్ష్మి’లో భాగంగా ఇకపై వధూవరులకు రెండు కిలోల ఉల్లిపాయలను కూడా కానుకగా అందిస్తామని ఆయన ప్రకటించారు. ఉల్లి కొరతలో కేంద్రం వైఫల్యమే ఎక్కువగా ఉందన్నారు. తాను జాతీయ రాజకీయాల్లో ఉండి దేశానికి దిక్సూచినై ఉంటే ఉల్లి కొరత రానిచ్చేవాడినే కాదన్నారు. త్వరలో ఏదైనా మహాయాగం చేసి ఉల్లి కొరత నివారించేలా చూస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.

ఇదిలావుండగా, ఉల్లి తింటే నోరంతా కంపు కొడుతుందనీ, పైగా ఉల్లిపాయలు కోసేప్పుడు కళ్ల వెంట నీరు కూడా కారుతుందనీ, ఎక్కువ ధర పెట్టి కొంటే కళ్ల వెంట నీళ్లొస్తాయనీ, కాబట్టి ఉల్లిని తినడం మానేస్తేనే మేలని కేంద్రం పౌరులకు సలహా ఇచ్చింది. దేశప్రజల కంటి వెంట ఏరకంగానూ నీరు రాకుండా అచ్చేదిన్ ఇస్తానంటూ ప్రధాని మోదీ వాగ్దానం చేశారు కనుక ఉల్లిని వాడకుండా వదిలేస్తేనే మంచిదని కేంద్రం సూచించింది. ఉల్లి తినే విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను అంతా ఆదర్శంగా తీసుకోవాలని కేంద్రం కోరింది. ఉల్లిని బహిష్కరిస్తే అసలు ఉల్లి సమస్యే తలెత్తదని కేంద్రం అభిప్రాయపడింది. భారతీయ సనాతన సంప్రదాయం తామస లక్షణం కలిగిన ఉల్లిని నిషేధిచింది కనుక భారతీయులంతా ఉల్లికి దూరంగా ఉండాలనీ, అదే నిజమైన హిందుత్వమనీ బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహా రావు వ్యాఖ్యానించారు. తాను ఉల్లి తినడం మానేసి దేశానికి ‘ఆనియన్ ఛాలెంజ్’ విసురుతున్నానని ఆయన ప్రకటించారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఉల్లి హిందుత్వవాదాన్ని తప్పుబట్టింది. ఇలా హిందూత్వను ఇతర మతాలవారిపై రుద్దడం సెక్యులర్ సూత్రాలను విరుద్ధమని ఏఐసీసీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా విమర్శించారు. అలాగే ‘మోదీ హై తో ముమ్కిన్ హై’ (మోదీ ఉంటే అన్నీ సాధ్యం అవుతాయి) అన్న నినాదం ఉల్లికి ఎందుకు వర్తించడం లేదో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ ఒక ట్వీట్ లో నిలదీశారు.

మరోవైపు ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా ఉల్లి ధరలపై స్పందించింది. ఇసుక వారోత్సవాలలాగే ఉల్లి వారోత్సవాలను కూడా నిర్వహించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ఉల్లి భరోసా, ఉల్లి కానుక పథకాలు ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేయాలని ఆదివారం జరిపిన ఒక ఉన్నతస్థాయి సమీక్షాసమావేశంలో ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజలు ప్రభుత్వంపై ఆధారపడకుండా ఉల్లిని మిద్దె పంటగా వేసుకునేలా ప్రోత్సహించాలని ఆయన సూచించారు. కాగా, ఉల్లి సరఫరాలో వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ నేత నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఉల్లి వారోత్సవాలు పరిస్థితిని చక్కదిద్దలేవన్నారు. తమ హయాంలో ఉల్లి సరఫరాకు అన్ని చర్యలూ తీసుకున్నందు వల్లే  వైసీపీ నేతలు, కార్యకర్తలు ఉల్లి తినగలిగిన సంగతి మరచిపోరాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇంకోవైపు, ఉల్లి సరఫరాను పోలీసులకు అప్పగించడం ద్వారా ప్రభుత్వాలు హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని పౌరహక్కుల సంఘాలు విరుచుకుపడ్డాయి.

 

——————————————————————————–
Note: వ్యంగ్యవార్త అన్నది Faking News రచనాపద్ధతిలో ఒక భాగం.  ఇవి నిజం వార్తలు కావు. ఆయా వాదనలు, రాజకీయ నాయకుల వైఖరుల్లోని డొల్లతనాన్ని వ్యంగ్యపద్ధతిలో ఎత్తిచూపడం దీని ఉద్దేశ్యం. పాఠకులు గమనించగలరు.
author avatar
Srinivasa Rao Y

Related posts

Raghurama krishnamraju: ఖాళీగా ఉండ‌లేక ర‌ఘురామరాజు ఏం చేస్తున్నాడంటే…

sridhar

KCR: ఆ ఇద్ద‌రు `లేడీ లీడ‌ర్లు` కేసీఆర్ ను ఎలా ఇరికిస్తున్నారంటే…

sridhar

Pawan Kalyan :డియర్ పవన్ కల్యాణ్… ఆంధ్రుడి లేఖ మీకు అందిందా?

sridhar

బాలకృష్ణ‌ పై టీడీపీ నేత‌ల్లో అసంతృప్తి …. చంద్ర‌బాబు విష‌యంలో ఇలాగేనా చేసేది?

sridhar

సూపర్ స్టార్ రజనీకాంత్ ‘గెటప్’లో సెహ్వాగ్!

Teja

ఎంత ప‌ని చేశావు జ‌గ‌న్‌… పార్టీ నేత‌లే త‌ట్టుకోలేక పోతున్నారు

sridhar

Dhivya Bharathi Joshful Photos

Gallery Desk

వామ్మో… ఫేస్‎బుక్‎లో గొడవయ్యిందని చంపేస్తావా…!!

sekhar

బాబు గారు..!! మీకర్ధమవుతుందా..??

Srinivas Manem

ఓయ్, నీకర్థమౌతోందా..

Srinivas Manem

ట్రిప్పుల ట్రిక్కులు, తిప్పలు…!

Srinivas Manem

విందుకు పిలుపు రాలేదెందుకు?

Srinivasa Rao Y

యోగి ‘బద్ LAW’

Srinivasa Rao Y

అవర్ టెల్గు మదర్!

Srinivasa Rao Y

ఒకటి కాదు.. పదమూడు!

Srinivasa Rao Y

Leave a Comment