చంద్రబాబుపై కేసు నమోదు చేయాలి

ఢిల్లీ, డిసెంబరు31: సుప్రీం కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై
కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ పార్లమెంట్ ఆవరణలోని గాంధీజీ విగ్రహం వద్ద విజయసాయిరెడ్డి ఆందోళన చేపట్టారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. వైఎస్ జగన్‌ కోసం హైకోర్టును విభజించారని చంద్రబాబు పేర్కొనడాన్ని ఖండించారు. తెలంగాణా సీఎం ఏపీకి ప్రత్యేక హోదాకోసం ప్రధాని మోదీకి లేఖ రాస్తానని చెప్పడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక హోదాకు ఎవ్వరు మద్దతు పలికినా స్వాగతిస్తామని చెప్పారు.
ప్రభుత్వ నిధులు సుమారు 4లక్షల కోట్ల రూపాయలను సీఎం చంద్రబాబు స్వాహా చేశారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి రాగానే చంద్రబాబు తిన్నదంతా కక్కిస్తామన్నారు. త్రిపుల్ తలాక్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని, పలు కీలక అంశాలను సెలెక్ట్ కమిటీ పరిశీలన చేయాలనీ అన్నారు.