ఈవీఎం అంటే ఎందుకు భయం?

విజయవాడ, డిసెంబర్ 21: భారత దేశంలో వివిధ రాజకీయ పక్షాలు ఏలక్ట్రానిక్ ఓటింగ్ (ఈవీఎం)ల ద్వారా ఎన్నికల నిర్వహణను వ్యతిరేకిస్తున్నాయి. చాలా సందర్భాల్లో అధికారంలో ఉన్నప్పుడు వీటిపై ఏమీ మాట్లాడని వారు ప్రతిపక్షంగా ఉన్న సమయంలోనే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంల వివాదాన్ని ఫుట్‌బాల్‌ ఆటగా మార్చొద్దని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా తాజాగా రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఇదిలావుంటే,  ఏపీ సీఏం చంద్రబాబు నాయుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్,  బీఎస్పీ నాయకురాలు మాయావతి, తెలంగాణ పీపీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆరోపణలు, అనుమానాల మాట ఎలా ఉన్నా ఎన్నికల కమిషన్ మాత్రం ఈవీఎం విధనాన్ని మార్చే అవసరం లేదని స్పష్టం చేస్తోంది.

ఈవీఎంలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలు :

  • భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1982లో కేరళ రాష్ట్రం నార్త్ పరావూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంల ద్వారా ఎన్నిక నిర్వహించారు
  • 2003లో అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికలు ఈవీఎంలతో జరిగాయి
  • 2004 నుండి పార్లమెంట్ ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహిస్తున్నారు
  • ఈవీఎం ద్వారా పోలింగ్‌తో కొద్ది గంటల వ్యవధిలోనే ఫలితాలు
  • 2014 సాధారణ ఎన్నికలలో 8 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఓటరు ధ్రువీకరించుకోగలిగే పేపర్ ఆడిట్ ట్రెయిల్ (వివిపిటీ) (Voter verifiable paper audit trail (VVPAT)ను ప్రవేశపెట్టారు. ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో వీటిని వాడారు
  • 1990లో ఎన్నికల సంస్కరణలపై ఏర్పాటు చేసిన సాంకేతిక నిపుణుల సబ్ కమిటీ ఈవీఎంల పనితీరులో సాంకేతికతను ఆమోదించింది
  • కర్ణాటక హైకోర్టు కూడా ఈవీఎంలతో ఎన్నికను సమర్థిస్తూ వాటిని జాతికి గర్వకారణంగా పేర్కొని ప్రశంసించింది
  • ఈవీఎంలతో పాటు వీవీపీఏటీ లను ఉపయోగించుకోవాలని సుప్రీంకోర్టు చేసిన సూచనతో వీవీపీఏటీలను తీసుకువచ్చారు
  • ప్రపంచంలోని జర్మనీ, నెదర్లాండ్స్ వంటి పలు దేశాలు ఈవీఎంలను వినియోగించడం లేదు
  • మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ ఎన్నికల్లో విజయం తర్వాత కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈవీఎంల టాంపరింగ్‌పై మాట్లాడారు

ఈవీఎం ఎలా పని చేస్తుందో తెలుసుకునేందుకు ఈ వీడియోపై క్లిక్ చేయండి.