దుబాయి వినువీధుల్లో అద్భుతం
ఆకాశంలో సుడితో కూడిన రంధ్రం
ఏం జరిగిందోనని అంతా ఆశ్చర్యం
జెడ్డా: సాధారణంగా మనం రోడ్డు మీద సుడిగాలి చూస్తుంటాం. దుమ్ము గుండ్రంగా పైకి లేచి సుడిలా తిరుగుతుంటుంది. అంతవరకు మామూలే. కానీ, ఉన్నట్టుండి అలాంటి సుడిగాలి ఆకాశంలో కనిపిస్తే ఎలా ఉంటుంది? అది కూడా ఆకాశానికి పెద్ద రంధ్రం చేసినట్లుంటే? ఇదంతా వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ యూఏఈలోని అల్ ఐన్ అనే నగరంలో ఇలాగే కనిపించింది. దాంతో ఏం జరిగిందోనని జనమంతా ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యి చక్కర్లు కొడుతోంది. ఇలా ఆకాశంలో సుడిగాలి రేగిన దృశ్యాన్ని ఇబ్రహీం అల్ జర్వాన్ అనే వ్యక్తి తన కారులో వెళ్తూ వీడియో తీశారు. దాన్ని ట్వీట్ చేశారు. ఆయన ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త, వ్యోమగామి అని డైలీ మెయిల్ పత్రిక తెలిపింది.
شوهدت هذه الظاهرة النادرة والجميلة صباح اليوم في مدينة العين
تُسمى hole punch cloud
أو ظاهرة fallstreak hole pic.twitter.com/NbOd9zofNk— إبراهيم الجروان (@ibrahimaljarwan) March 17, 2019
దాన్ని ‘వర్ల్ పూల్ హోల్’ అని పలువురు చెబుతున్నారు. అది మరో ప్రపంచానికి తీసుకెళ్లే మార్గమని కూడా కొందరు అన్నారు. ఈ వీడియోను ఇబ్రహీం అల్ జర్వాన్ షేర్ చేశారు. ‘‘ఇది చాలా అరుదైన, అందమైన దృశ్యం. అల్ ఐన్ నగరంలో ఉదయాన్నే కనిపించింది’’ అని రాశారు. చాలా మంది దీన్ని వేరే గ్రహం నుంచి వచ్చిన యూఎఫ్ఓ అయి ఉంటుందని కూడా భావించారు. వేరే ప్రపంచానికి తీసుకెళ్లేందుకు మనకు లభించిన మార్గమన్నారు. అయితే అంతరిక్ష శాస్త్రవేత్తలు ఆకాశంలో కనిపించిన ఈ రంధ్రానికి సంబంధించిన రహస్యాన్ని త్వరగానే ఛేదించారు. వీటిని సాధారణంగా ఫాల్ స్ట్రీక్ హోల్ అని అంటారు. మేఘాల్లో నీటి ఉష్ణోగ్రత ఘనీభవన స్థాయి కంటే తక్కువగా ఉండి, నీళ్లు మాత్రం ఐస్ న్యూక్లియేషన్ లేకపోవడం వల్ల గడ్డ కట్టకుండా బాగా చల్లటి స్థితిలో ఉన్నప్పుడు ఇలా అవుతుందన్నారు. అయితే ఈ తరహా ఫాల్ స్ట్రీక్ రంధ్రాలు ఏర్పడటం అత్యంత అరుదైన విషయం. ఇవి ఒకోసారి 50 కిలోమీటర్ల మేర కూడా విస్తరిస్తాయి. వీటిని చూసే చాలామంది గ్రహాంతర వాసులు వచ్చే యూఎఫ్ఓలుగా భావిస్తారు.