ఇలాంటి దొంగలు మన ఇంటికి కూడా రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ, అమెరికాలోని మసాచుసెట్స్ ప్రాంతంలో నివసించే నేట్ రోమన్ మాత్రమే ఆ అదృష్టం దక్కించుకున్నారు. ఈ విషయంపై సీఎన్ఎన్ వార్తాసంస్థ ఓ ఆసక్తికర కథనం ప్రచురించింది. మే 15న రోమన్ తన ఇంటికి వచ్చి చూసుకునేసరికి ఆయన ముందుగుమ్మం తాళం తీసి ఉంది. ఆ విషయాన్ని అతడి కొడుకు కూడా చెప్పాడు. ఇద్దరూ లోపలకు వెళ్లి చూసుకుంటే.. ఏదో తేడా ఉంది. ఇల్లు మొత్తం శుభ్రంగా కనిపిస్తోంది. అంతకుముందు ఎక్కడపడితే అక్కడుండే సామాన్లు ఏవీ అలా లేవు. సాధారణంగా చెత్తచెత్తగా ఉండే అతడి కొడుకు గది కూడా చాలా పద్ధతిగా సర్దేసి ఉంది. నేట్ సొంత గది సైతం అలాగే శుభ్రం చేసి ఉంది. పైపెచ్చు.. ఇంట్లో ఒక్క వస్తువు కూడా పోలేదు. అంతేనా, బాత్రూం కూడా మొత్తం శుభ్రం చేసి, అందులోని టాయిలెట్ పేపరుతో మంచి కాగితం గులాబీ చేసిపెట్టి మరీ ఉంచారు.
ఈ విషయం మొత్తాన్ని నేట్ తన ఫేస్ బుక్ ఖాతాలో అందరితో పంచుకున్నారు. తన ఇంట్లో ఒక్క వస్తువు కూడా తీసుకెళ్లకపోగా, అతడు కావాలనే తమ బెడ్రూంలు, బాత్రూంలను శుభ్రం చేయడానికి వచ్చినట్లుందని అన్నారు. పక్కబట్టలన్నీ శుభ్రంగా సర్దేసి, రగ్గులను వాక్యూం క్లీనరుతో శుభ్రం చేసి, బాత్రూంలు కడిగి, కాగితపు గులాబీలు అమర్చి మరీ వెళ్లాడన్నారు. నేట్ వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. అయితే వాళ్లు వచ్చి, ఇక్కడ ఎలాంటి నేరం జరగలేదని, ఏమీ పోలేదని, అందువల్ల తాము చేయాల్సింది ఏమీ లేదని వెళ్లిపోయారన్నారు. ఆ తర్వాత ఇంటి ముందుగుమ్మం తాళం మార్చుకున్నా.. దొంగ తయారుచేసిన కాగితం గులాబీని మాత్రం అతడి గుర్తుగా దాచిపెట్టుకున్నారు.