ఎమ్మార్వో విజయారెడ్డి డ్రైవర్ మృతి

హైదరాబాద్‌: అబ్దుల్లాపూర్‌మెట్‌ తహశీల్దార్‌ విజయారెడ్డి సజీవ దహనం ఘటనలో మరో విషాదం చోటు చేసుకుంది. విజయారెడ్డిపై పెట్రోల్ పోసి తగులబెట్టిన సమయంలో ఆమెను రక్షించబోయి గాయాలపాలైన డ్రైవర్ గురునాథం డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం(నవంబర్ 5) మృతి చెందాడు. సోమవారం సురేష్ అనే వ్యక్తి అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే విజయారెడ్డిని కాపాడే క్రమంలో డ్రైవర్ గురునాథం తీవ్రంగా గాయపడ్డాడు. 80 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన గురునాథం.. చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచాడు. గురునాథానికి భార్య, ఒక బిడ్డ ఉండగా, ప్రస్తుతం అతని భార్య గర్భవతిగా ఉంది. సూర్యాపేట జిల్లాకు చెందిన గురునాథం ఎనిమిది సంవత్సరాలుగా విజయారెడ్డి వద్దే డ్రైవర్ గా పని చేస్తున్నాడు. గురునాథం మృతితో సూర్యాపేట జిల్లా వెలిదండ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.