న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ తప్పుకోవడం ఖాయమని తేలిపోయింది. పదవిలో కొనసాగేందుకు చివరికి అంగీకరించకపోతారా అన్న ఆశతో ఉన్న కాంగ్రెస్ వాదులకు ఆయనే స్వయంగా ఆఖరిమాట చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇక జాప్యం చేయకుండా వీలైనంత త్వరలో ఆధ్యక్ష పదవికి ఎవరినన్నా ఎన్నుకోవాలని ఆయన బుధవారం మీడియాతో అన్నారు. మరో వారం రోజుల్లో రాహుల్ గాంధీ స్థానంలో అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపినట్లు ఎన్డిటివి పేర్కొన్నది.
‘నేను నా రాజీనామా ఇప్పటికే ఇచ్చాను. నేను ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో లేను’ అని రాహుల్ పేర్కొన్నారు. కాంగ్రెస్లో అత్యున్నత నిర్ణాయక వేదిక అయిన వర్కింగ్ కమిటీ వీలైనంత త్వరలో సమావేశమై నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవాలని ఆయన అన్నారు. అయితే తాను ఆ ప్రక్రియలో పాలు పంచుకున్నందు వల్ల వ్యవహారం సంక్లిష్టం అవుతుంది కాబట్టి తాను దూరంగా ఉంటానని ఆయన చెప్పారు. పార్టీలో కొనసాగుతాననీ, పని చేస్తాననీ రాహుల్ పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పరాజయానికి నైతక బాధ్యతగా రాహుల్ గాంధీ మే నెల 25వ తేదీన పార్టీ నాయకత్వానికి రాజీనామా ఇచ్చారు. కొందరు నాయకులు ఎన్నికలలో పార్టీ ప్రయోజనాల కన్నా స్వీయ ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని కూడా ఆయన అన్నారు. అప్పటి నుంచీ ఆయనతో రాజీనామా ఉపసంహరింపజేసేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. రాహుల్ మాత్రం పట్టు వీడలేదు. తన స్థానంలో గాంధీ కుటుంబం నుంచి కాకుండా బయటివారిని ఎన్నుకోవాలని ఆయన అంటున్నారు.