(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఓ కండక్టర్ తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్ పంపాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బంగారు తెలంగాణలో తాను ఉద్యోగం చేయలేకపోతున్నానంటూ సదరు ఆర్టీసీ ఉద్యోగి రాజీనామా చేశాడు. ఆ లేఖలో తాను రాజీనామా చేయడానికి గల కారణాలను ప్రస్తావిస్తూనే కేసీఆర్పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
‘’గౌరవనీయులైన తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి….
తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో ఉద్యోగం చేద్దామనుకున్న ఆత్మగౌరవంతో బ్రతుకుదాం అనుకున్నా కానీ మీలాంటి గొప్ప మనిషి ఉన్న ఈ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో కాదు కదా కనీసం ‘తెలంగాణలో ఎందుకు పుట్టాను రా నాయనా’ అనే విధంగా గా తీవ్ర మానసిక వేదనకు గురై నేను ఈ నిర్ణయం తీస్కుంటున్నాను”
”మీకు మాట తప్పడం, మాయమాటలు చెప్పి మోసం చెయ్యడం తెలుసు అని మా కార్మికలోకం లేట్ గా తెలుసుకుంది. మీరు ఉద్యోగంలో నుండి తీసేయడం కాదు.. నేనే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. దానికి కారణం లేకపోలేదు సర్ మా తెలంగాణలో నియంతృత్వం చూస్తా అని అనుకోలేదు. 1200 మంది ఆత్మహత్య చేసుకుంటే మన కేసీఆర్ సర్ ఉన్నారు, ఆంధ్ర పాలకులు నిజంగా మోసం చేశారేమో, మనల్ని బాగా చూసుకుంటారు అనుకున్న. కానీ, సర్ మా 30 మంది కార్మికులు చనిపోతే మీరు కనీసం స్పందించలేదు చూడండి సర్ అప్పుడు అనిపించింది సర్ తెలంగాణ మా కోసం కాదు తెలంగాణా కేవలం మీ లాంటి నాయకుల కోసమే అని. నా అక్క చెల్లెమ్మలు లాఠీ దెబ్బలు తింటారు అని కలలో కూడా ఉహించలేదు సర్ కానీ మీ బంగారు తెలంగాణలో అది సాధ్యం అయింది. సర్, నా చెల్లెలు ఏడుస్తుంటే, రోజు నా సోదరులు బాధ పడుతుంటే తట్టుకోలేకపోతున్న సర్ కానీ ఒక్కటి మాత్రం నిజం సర్ ‘నా ఆర్టీసీ అక్క చెల్లెల ఉసురు కచ్చితంగా మీకు తగులుతుంది సర్’, నేను సూర్యాపేట డిపోలో ఆర్టీసీ కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న. మీలాంటి ఒక మోసకారి ఒక మాటకారి ఒక మానవత్వం లేని ఒక నిరంకుశ ప్రభుత్వంలో నా ఆత్మభిమన్నాన్ని చంపుకొని ఉద్యోగిగా పని చేయలేను. అందుకే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్న నా పేరు యల్.కృష్ణ నా స్టాప్ నెంబర్ 176822. సూర్యాపేట డిపో సర్. నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను.
మీ సంస్థ నుండి నాకు రావాలిసిన బకాయిలను ఇప్పించి నా రాజీనామాను ఆమోదించగలరని నా యొక్క మనవి. అయ్యా సీఎం సారూ.. మీరు ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఒక్క సారి గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు మీ వైఖరి గుర్తు చేసుకోండి. పాపం సర్ ఆర్టీసీ వాళ్ళు సర్ మీమ్ములను చాలా అభిమానించారు. కానీ మీరు ఇలా చేస్తారు అని కలలో కూడా ఉహించిఉండరు. పాపం ఆర్టీసీ వాళ్ళు సర్ వాళ్లకు వచ్చే 15000 జీతం తీసుకొని ఫ్యామిలీని చూసుకుంటూ చాలా గౌరవంగా బ్రతుకుతున్నారు. మీరూ వాళ్లకు ఏమి ఇవ్వకున్న కనీసం పిలిచి మాట్లాడి ఉంటే మీమీద గౌరవంతో ప్రాణాలు ఇచ్చేవారు సార్. కనీసం నేను మీ బంగారు తెలంగాణలో సంతోషంగా లేను. కనీసం మా తల్లిదండ్రులైనా సంతోషంగా ఉండేటట్లు నెల నెలా వాళ్ళకి వృద్దాప్య పింఛన్ ఇవ్వండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి మీకు ఓటు వేశారు సర్. వాళ్ళు బాధపడుతుంటే సమాజంలో ప్రతి ఒక్కరు చిన్న చూపు చూస్తుంటే ప్రతి ఒక్కరు నన్ను దినంగా చూస్తుంటే తట్టుకోలేక పోయాను సర్. ప్రతి రోజు ఈ అరెస్టులు ఏంది ? ఈ లాఠీ దెబ్బలు ఏంది ? నా ఆర్టీసీ సోదరులు ఏమి తప్పు చేశారు ? అని ఇంకా ఎంత మందిని ఆత్మహత్యలు చేస్కునేట్టు చేస్తారు ? అందుకే ఇవన్నీ భరించలేకనే నా ఆత్మభిమానాన్ని చంపుకొని ఉద్యోగం చేయలేను. అందుకే నేను మీ బంగారు తెలంగాణాలో ఉద్యోగం కోల్పోయిన ఉద్యోగిని.
మీ మాయ మాటలు నమ్మి మోసపోయిన తెలంగాణ సమాజంలోని వ్యక్తిని. నీ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగిగా ఉన్నాను కాబట్టి తక్షణమే నా తల్లిదండ్రులకు వృద్ధాప్య పింఛను ఒక్కటి ఇవ్వండి. పేరు మీద సెంటు భూమి లేదు. కాబట్టి మూడు ఎకరాల పొలం అలాగే నా పిల్లలకి ప్రభుత్వ స్కూల్లో చదువు, నాకు ఉండడానికి ఇల్లు లేదు కనుక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వండి. ఒకవేళ మీరు ఏమి ఇవ్వకున్న సమాజంలో గౌరవంగా బ్రతికే అవకాశం కల్పించాలని కోరుతూ అలాగే, నా ఉద్యోగ రాజీనామా ను తక్షణమే ఆమోదించగలరు.’’
ఇట్లు
ఎల్. కృష్ణ
స్టాఫ్ నెంబర్ 176822
ఆర్టీసీ కండక్టర్ సూర్యాపేట డిపో