(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
సైన్స్ పాఠాలు చెప్పేందుకు ఓ ఉపాధ్యాయిని అనాటమీ సూట్ ధరించి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించిన ఒక వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ టీచర్ ఘనతను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
పిల్లలకు సైన్స్ పాఠాలు వారికి అర్థమయ్యేరీతిలో చెప్పడం కొంత కష్టమే. దీన్ని అధిగమించేందుకు ఆ టీచరమ్మ వినూత్న ఆలోచన చేసింది. వెరోనికా డుకీ 15 సంవత్సరాలుగా ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నది. సైన్స్ పాఠాలు బోధించేందుకు ఓ అనాటమీ సూట్ డిజైన్ చేసింది. ఆ సూట్ వేసుకుని క్లాస్‌కు వచ్చి మూడవ తరగతి విద్యార్థులకు శరీరంలోని భాగాలను చూపిస్తూ బోధించిన తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
చిన్న వయసు పిల్లలు అవయవాలను ఊహించుకోవడం కష్టమనీ, అందువల్లే తాను ఇలా వచ్చి, శరీర భాగాలను చూపించానని ఆమె చెప్పారు. తరగతి గదిలో వెరోనికా భర్త వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆమె వీడియోకు లక్షల్లో కొద్దీ లైక్స్, వేల కొద్దీ రీ ట్వీట్స్ వస్తున్నాయి.