ఈ నిర్మాణాలన్నీ ఇక డ్రాయింగ్‌లకే పరిమితమా ?
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి నుంచి రాజధాని దొనకొండకు తరలిపోతుందా అన్న ప్రశ్నపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మంత్రి బొత్స సత్యనారాయణ మాటల వల్ల రేగిన ఈ వివాదంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా స్పందించారు. కోర్ క్యాపిటల్‌ను తుళ్లూరు నుంచి తరలించాలన్న ప్రభుత్వ ఆలోచన వల్లనే ఈ చర్చకు తెర లేపారన్న మాట ఇప్పుడు వినబడుతోంది.
రాజధాని అమరావతి పరిధి లోనే ఉంటుంది కానీ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించిన చోట కాకుండా మరోచోట కోర్ క్యాపిటల్ నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కావాల్సిన భూమిని మంగళగిరి ప్రాంతంలో గుర్తించినట్లు కూడా చెబుతున్నారు.
రాజధానికి కావాల్సిన సచివాలయం, శాసనసభ, హెచ్వోడిల కార్యాలయాలు, ఇతర అన్ని ప్రధాన కార్యాలయాలూ మంగళగిరి దగ్గర తాము గుర్తించిన చోట నిర్మించాలన్నది జగన్ అభిమతమని అంటున్నారు.
దీనిని బలపరుస్తూ మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రాజధాని మంగళగిరి ప్రాంతంలో నిర్మించాలని అన్నారు. రాజధాని అంటే ఇప్పుడు రాజధాని నిర్మిస్తున్న తుళ్లూరు మాత్రమే కాదనీ, మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాలు కూడా రాజధాని పరిధిలోనే ఉన్నాయనీ ఆయన అన్నారు. నిన్న హిందూ అంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి కూడా రాజధాని వేరు, రాజధాని నగరం వేరు అన్నారు.
ఈ ఇద్దరి మాటలూ కూడా కోర్ క్యాపిటల్ తరలివెళుతుందన్న ఊహాగానాలనే బలపరుస్తున్నాయి.
రాజధానికి అమరావతి సురక్షితం కాదని శివరామకృష్ణన్ కమిటీ ముందే చెప్పిందన్న బొత్స మాటలతో ఈ గందరగోళం మొదలయింది. ఆ కమిటీ వినకుండా అక్కడే రాజధాని నిర్మాణం ప్రారంభించారనీ ఆయన మొన్న కృష్ణానది వరదల సందర్భంగా వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా ప్రభుత్వం అన్నీ పరిశీలిస్తున్నదనీ, త్వరలోనే ఏదో ఒకటి నిర్ణయిస్తుందనీ ఆయన అన్నారు. దానితో రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంచలనం కలిగింది.
తర్వాత వైసిపి నాయకులు చాలామంది దీనిపై మాట్లాడారు కానీ ఎవరూ స్పష్టత ఇవ్వలేదు. ఇంత ముఖ్యమైన విషయంపై ముఖ్యమంత్రి అనుమతి లేకుండా బొత్స మాట్లాడరనీ, కావాలనే ఆయనతో ఈ మాటలు మాట్లాడించారని కొందరు సూత్రీకరించారు.
అమరావతిలో 25 శాతం లోపు పూర్తయిన నిర్మాణాలను నిలిపివేయించిన ముఖ్యమంత్రి రాజధాని విషయంలో తన మనసులోని మాట ఇంతవరకూ బయటపెట్టలేదు. రాజధాని విషయంలో ఏం జరుగుతుందన్న ప్రశ్న అందరినీ వేధిస్తొంది.