మోదీ జాకెట్ అంటే.. ఆయన కుర్తా మీద పైన వేసుకునే జాకెట్ అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు మార్కెట్ లోకి కొత్తగా మోదీ యాపిల్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నమో ఎగైన్, వుయ్ సపోర్ట్ నరేంద్ర మోదీ అనే పేస్ బుక్ పేజీలు, గ్రూపులలో ఇది తిరుగుతోంది. అలాగే ఫొటోలతో కూడిన సందేశం ట్విట్టర్, వాట్సాప్ లలో కూడా ప్రచారం అవుతోంది.
ఇటలీ మోదీ
కానీ నిజానికి ఈ యాపిల్ పండుకు భారత ప్రధాని నరేంద్రమోదీ పేరు పెట్టలేదు. ఇది ఇటలీలో తయారైన కొత్తరకం యాపిల్. దీని అధికారిక పేరు CIVG198. ఈ బ్రాండు యాపిల్ పండ్ల గురించి www.modiapple.com అనే వెబ్ సైట్ చూస్తే తెలుస్తుంది. ఈ డొమైన్ ఎప్పుడో 2007లోనే రిజిస్టర్ అయినట్లు ‘ఆల్ట్ న్యూస్’ కనుగొంది. అంటే, నరేంద్రమోదీ ప్రధాని కావడానికి చాలా ముందే అన్నమాట. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం ప్రకారం అమెడియో మొడిగిలానీ అనే 19వ శతాబ్దం నాటి ఇటాలియన్ పెయింటర్ పేరు మీద యాపిల్ పండుకు పేరు పెట్టారు. అంతేకాదు.. ఇందులో మోదీ స్పెల్లింగు కూడా కొంత భిన్నంగా ఉంటుంది. ఐ అనే అక్షరం మీద పైన ఇటాలియన్ స్పెల్లింగు ప్రకారం ఒక గీత ఉంటుంది. అయితే, భారత ఉపఖండంలోకి త్వరలోనే తమ మోదీ యాపిల్ ను ప్రవేశపెడతామని ఆ సంస్థ ప్రకటించింది. కానీ ప్రధాని నరేంద్రమోదీకి, ఆ యాపిల్ పండుకు మాత్రం సంబంధం లేదు.
https://twitter.com/Pooja09876089/status/1110138470758903808