పాక్ మ్యూజియంలో వింగ్ కమాండర్ అభినందన్!

ఇస్లామాబాద్: భారత్ పై నిత్యం తప్పుడు ఆరోపణలు చేసే పాకిస్థాన్ ఈసారి మరోలా తన అక్కసును ప్రదర్శించింది. కరాచీలోని పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ మ్యూజియంలో భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ నిలువెత్తు బొమ్మను ఏర్పాటు చేసింది. పాకిస్థాన్ జర్నలిస్ట్, పొలిటికల్ కాలమిస్టు అన్వర్ లోధీ.. దీనికి సంబంధించిన ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. “మ్యూజియంలో పీఏఎఫ్ అభినందన్ బొమ్మను ఉంచింది. అతని చేతిలో ఓ టీకప్పును కూడా ఉంచితే మరింత బాగుండేది” అని లోధీ తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు.

అయితే పాక్ మ్యూజియంలో పెట్టిన అభినందన్ ఫొటోలో వెనక పాకిస్థాన్ సైనికుడు కూడా ఉన్నాడు. భారత కమాండర్ అభినందన్‌ను పట్టుకున్నాం అని సందర్శకులకు చూపడానికే ఈ పని చేసి ఉంటారని నెటిజన్లు భావిస్తున్నారు. ఇది తప్ప పాకిస్థాన్ సైన్యానికి చెప్పుకోవడానికి వేరే విజయాలు లేవని మరికొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 27న అభినందన్ పాకిస్థాన్ సైన్యానికి పట్టుబడిన విషయం తెలిసిందే. మిగ్-21 బైసన్ ఫైటర్ జెట్‌తో వెంబడించి ఎఫ్-16 విమానాన్ని కూల్చేశాడు. ఆ క్రమంలో పాక్ విమానంతో పాటు అభినందన్ విమానం కూడా కుప్పకూలింది. పారాచూట్ సాయంతో ప్రాణాలు కాపాడుకున్న అభినందన్..పీవోకేలోని ఓ గ్రామంలో దిగడంతో స్థానికులు చితకబాది పాక్ మిలటరీకి అప్పగించారు. దీంతో పాక్ దళాలు అభినందన్‌ను బంధీగా పట్టుకున్నాయి.  భారత వాయుసేన రహస్యాలను కూపీలాగేందుకు పాకిస్తాన్ ఆర్మీ ప్రయత్నించినప్పటికీ..అభినందన్ ఏ వివరాలను బహిర్గతం చేయలేదు. ఐతే భారత్‌తో పాటు అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిళ్లు రావడంతో ఎట్టకేలకు తలొగ్గిన పాకిస్తాన్…అభినందన్‌ను తిరిగి భారత్‌కు అప్పగించింది. పాకిస్తాన్ యుద్ద విమానాన్ని కూల్చేక్రమంలో పాక్ ఆర్మీకి చిక్కి భారత సైన్యం తెగువచూపిన.. అభినందన్ దేశ ప్రజలకు రియల్ హీరోగా మారాడు. ఆయన మీసకట్టుకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఎంతో మంది యువకులు అభినందన్‌ మీసాల స్టైల్‌ను ఫాలో అయిన సంగతి తెలిసిందే.