ఉద్ధవ్ ఠాక్రే అనే నేను…

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి సన్నద్ధమవుతోంది. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే గురువారం(నవంబర్ 28) సాయంత్రం 6.40 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దాదర్‌లోని శివాజీపార్క్‌ లో ఠాక్రే ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుంది. ఉద్ధవ్‌ తండ్రి బాల్‌ ఠాక్రే నిర్వహించిన దసరా సభలకు శివాజీ పార్కు ప్రసిద్ధి చెందింది. శివసేనాధిపతి బాల్‌ ఠాక్రే కుటుంబం నుంచి ముఖ్యమంత్రి అవుతున్న తొలి వ్యక్తిగా ఉద్ధవ్‌ ఠాక్రే చరిత్రకెక్కనున్నారు. తండ్రి ఆశయాలు, విధానాలకు విరుద్ధంగా కాంగ్రెస్‌, ఎన్‌సీపీలతో చేతులు కలిపిన ఉద్ధవ్ ఠాక్రే.. మూడు పార్టీలతో ఏర్పడిన ‘మహా వికాస్‌ ఆఘాడీ’ కూటమికి నాయకత్వం వహించనున్నారు. నిజానికి బాల్‌ ఠాక్రే కుటుంబం ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీచేయలేదు. శివసేన-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు శివసేన నేతలైన మనోహర్‌ జోషీ, నారాయణ్‌ రాణే సీఎంలయ్యారు. దాదాపు 20 ఏళ్ల తరువాత శివసైనికుడు మహారాష్ట్ర సీఎం పదవిని చేపట్టనున్నారు. చివరిగా శివసేనకు చెందిన నారాయణ్‌రాణే 1999లో సీఎం పదవినధిష్టించారు. అంతకుముందు 1995లో మనోహర్‌ జోషి శివసేనకు చెందిన తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ఇప్పటివరకు ఉద్ధవ్‌ కూడా ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే, తొలిసారి ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే అక్టోబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వర్లి నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచారు. అంతేకాదు ఠాక్రే కుటుంబం నుంచి చట్టసభలో అడుగుపెట్టిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఇప్పుడు సీఎం కాబోతున్న ఉద్ధవ్‌ ఠాక్రే ఆరు నెలల్లో అసెంబ్లీకి గానీ, శాసనమండలికి గానీ ఎన్నిక కావాలి. అయితే ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. శివసేన నుంచి ఒక ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి అక్కడ ఉప ఎన్నికలో తలపడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే, తండ్రి కోసం తన స్థానాన్ని వదులుకునేందుకు ఆదిత్య ఠాక్రే సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరోవైపు ఉద్ధవ్ ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా ప్రధాని మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తోపాటు పలువురిని ఆహ్వానించారు.

ఇక మంత్రివర్గ కూర్పుపై కూడా దాదాపుగా స్పష్టత వచ్చింది. ఎన్సీపీకి డిప్యూటీ సీఎం పదవి, కాంగ్రస్ పార్టీకి స్పీకర్ పదవి దక్కనున్నాయి. మహారాష్ట్రలో గరిష్ఠంగా 43 మంది మంత్రులుగా ఉండేందుకు అవకాశం ఉంది. శివసేన, ఎన్సీపీలకు 15 చొప్పున, కాంగ్రెస్ కు 13 మంత్రి పదవులును పంచుకోవాలని మూడు పార్టీలు అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. ఉద్ధవ్ తోపాటు మూడు పార్టీల నుంచి ఒకరు లేదా ఇద్దరు మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్ధవ్‌ మంత్రివర్గంలో అజిత్‌ పవార్‌ను కూడా చేర్చుకుంటారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్ర అసెంబ్లీ బుధవారం ప్రత్యేకంగా సమావేశమైంది. అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన 285 మంది సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ కాళిదాస్‌ కోలంబ్కర్‌ ప్రమాణం చేయించారు.