ఇన్‌స్పెక్టర్ హత్యకేసులో కీలక వ్యక్తి అరెస్టు

లక్నో, జనవరి 01 : ‌ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ర్టం బులందశహర్‌లో జరిగిన అల్లర్లలో పోలీసు అధికారి హత్యకు కారకుడైన మరొక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. గత ఏడాది డిసెంబర్ మూడున జరిగిన మూకుమ్మడి దాడిలో ఇన్‌స్పెక్టర్ సుబోధ్‌కుమార్ సింగ్‌ను గొడ్డలితో నరికి తుపాకీతో కాల్చిచంపారు. ఈ సంఘటనకు సంబంధించి గొడ్డలితో వేటు వేసిన కలువ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.
హత్యకు ఉపయోగించిన ఆయుధంపై నిందితుడి వేలి ముద్రలు లభించినట్లు పోలీసులు తెలిపారు. తుపాకితో కాల్చిన ప్రశాంత్ నట్‌ను డిసెంబరు 28న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడిలో కీలక పాత్ర పోషించిన జితేంద్ర మాలిక్‌ అనే వ్యక్తిని పోలీసులు డిసెంబరు తొమ్మిదిన అరెస్టు చేసి జుడీషియల్ కస్టడీకి పంపారు.
సుబోధ్‌కుమార్‌ సింగ్‌ హత్యలో మరో నిందితుడిగా బులందశహర్‌కు చెందిన జానీ అనే వ్యక్తిని గుర్తించారు. జానీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దాడికి సూత్రధారి అయిన భజరంగ్‌దళ్ నేత యోగేష్ రాజ్ కోసం పోలీసులు వెతుకుతున్నారు.