జీతాలు చెల్లించేందుకు నిధుల్లేవట!

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల వేతనాలు చెల్లింపునకు అవసరమైన నిధులు తమ వద్ద లేవని ఆర్టీసీ యాజమాన్యం హైకోర్టుకు తెలిపింది. ఆర్టీసీ కార్మికులకు జీతాల చెల్లింపుపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. జీతాల చెల్లింపుకు రూ. 230 కోట్లు కావాలని.. అయితే ఆర్టీసీ వద్ద రూ. 7.5 కోట్లే ఉన్నాయని అడ్వకేట్ జనరల్ న్యాయస్థానానికి తెలిపారు. కార్మికులు చేస్తున్న సమ్మె చట్టు విరుద్ధమని పేర్కొన్నారు. అయితే, చేసిన పనికి వేతనం ఇవ్వకపోడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు అభిప్రాయపడింది. జీతాలు చెల్లించకపోవడం వల్ల కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.

ఇదిఇలా ఉంటే ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 17వ రోజుకు చేరింది. ప్రభుత్వ వైఖరిపై ఆర్టీసీ కార్మికులు భగ్గుమన్నారు. నష్టాల సాకుతో ఆర్టీసీని విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఆరేళ్లుగా రాని సమస్య ఇప్పుడు ఎందుకొచ్చిందని కార్మికులు ప్రశ్నించారు. కోర్టుకు ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు  సమ్మె విషయంలో జోక్యం చేసుకోవాలని గవర్నర్ తమిళిసైతో ఆర్టీసీ జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు. హైకోర్టు వ్యాఖ్యలు, వేతనాలు లేక కార్మికులు పడుతున్న ఇబ్బందులను గవర్నర్ తమిళిసైకి ఆర్టీసీ జేఏసీ నేతలు వివరించారు. ఇక జేఏసీ నేతల విజ్ఞప్తిపై గవర్నర్ తమిళి‌సై సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఆర్టీసీ కార్మికులకు జీతాలు చెల్లించాలని గత వారం దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు స్పష్టమైన సూచనలు చేసింది. ఆక్టోబర్ 21వ తేదీ నాటికి జీతాలు చెల్లించాలని ఆర్టీసీని ఆదేశించింది. అయితే, ప్రభుత్వం మాత్రం హైకోర్టు ఆదేశాలను పట్టించుకోలేదు. ఆర్టీసీ సమ్మె విషయంలో అటు ప్రభుత్వం కాని, ఇటు కార్మిక సంఘాలు కాని ఏ మాత్రం తగ్గడం లేదు. కార్మికులు రోజు రోజుకు సమ్మెను మరింత ఉదృతం చేస్తుండగా.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. చర్చలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఆర్టీసీ కార్మికులు గవర్నర్‌ని కలిసి సమస్యలు పరిష్కరించాలని కోరారు.