న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులపై అస్సాం పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. నల్లజెండాలో నిరసన తెలుపుతున్న ఓ యువకుడిని పోలీసులు దారుణంగా కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సీఏఏకి వ్యతిరేకంగా అస్సాం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. పౌరసత్వ బిల్లుకు నిరసనగా ఈ వ్యతిరేకంగా విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఈ నిరసనల సెగ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్కు తగిలింది. బార్పేట జిల్లాలోని సార్థేబరి ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న ప్రజలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ కాన్వాయ్ ను అడ్డుకున్నారు. నల్లజెండాలు చూపిస్తూ నిరసన తెలిపారు. నల్బరి జిల్లాలో రోడ్డు మార్గంలో సీఎం కాన్వాయ్ వెళ్తున్న సమయంలో కొంతమంది ఆందోళనకారులు నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్(ఏఏఎస్ యూ), అస్సాం జతియతాబాది యువ ఛాత్ర పరిషత్(ఏజేవైసీపీ) యువకులు నల్ల జెండాలతో ఆందోళన చేశారు.
ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తున్నప్పుడు పౌరసత్వ చట్టానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో సీఎం సోనోవాల్ కాన్వాయ్ ని ఓ యువకుడు వెంబడించడం, ఆ వెనుకాలే పోలీసులు అతన్ని పట్టుకోవడం వీడియోలో కనిపిస్తోంది. అంతేకాదు ఆ యువకుడిని పోలీసులు దారుణంగా కొట్టిన దృశ్యాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవతున్నాయి. పోలీసుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.