పిడుక్కీ బిచ్చానికీ ఒకే మంత్రమా?

Share

అనగనగా ఓ పేదబ్రాహ్మణుడు. అతనేం చదువుకోనూలేదు – ఏ పనీ చెయ్యడమూ రాదు. ఫలితంగా అతగాడు కులవృత్తి అయిన పౌరోహిత్యం గానీ, మరో కులవృత్తి అయిన పఠన-పాఠనాలు  కానీ  చెయ్యలేకపోయాడు. గత్యంతరంలేక యాయవారం చేసుకుని బతుకీడ్చాలని నిర్ణయించుకున్నాడు. ఇంట్లో వున్న ఏకైక రాగిచెంబును శుభ్రంగా తోమి అగ్రహారం రోడ్డెక్కాడు. అయితే యాయవారానికి వెళ్లి ఏమని అడగాలో మనవాడికి తెలియదు. చిన్నప్పుడెప్పుడో పిడుగు పడినప్పుడు అమ్మమ్మ నేర్పించిన మంత్రం ఒక్కటే అతనికి గుర్తుంది- “అర్జున ఫల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన  బీభత్స విజయ కృష్ణ సవ్యసాచీ ధనుంజయ” అన్నదే ఆ “తారక మంత్రం.” ఇల్లిల్లూ తిరుగుతూ తనకొచ్చిన తారక మంత్రమే చదువుతూ పోయాడు ఆ పిచ్చిబ్రాహ్మడు. అసలే అగ్రహారమాయె- అందునా మెయిన్ రోడ్డయి పోయే- దాంతో నలుగురూ మనవాడి పాండిత్యాన్ని పసిగట్టేశారు!  ఫలితంగా మన పండిత పరమేశ్వర శాస్త్రికి నాలుగు గింజలు కూడా రాలక పోగా పెద్దల నుంచి అక్షింతలు మాత్రం దండిగా పడ్డాయి!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూడగానే నాకు గుర్తుకొచ్చిన కథ ఇది!

ఎప్పుడో “శాఖ”కు వెళ్లడం మొదలు పెట్టిన కొత్తలో బట్టీ పట్టిన పరమత అసహన -కొండొకచో ద్వేష- ప్రచారం అనే కుక్క తోక పట్టుకుని సకల ఎన్నికల గోదార్లనూ ఈదిపారేయగలమనే బీజేపీ దురాత్మ విశ్వాసాన్ని తాజా ఎన్నికల ఫలితాలు ఘోరంగా కుమ్మిపారేశాయి!! ఆప్ చీపురుతో ఓటర్లు బీజేపీని తుడిచిపెట్టేశారు. ఈ మధ్యకాలంలో బీజేపీకి ఈదురుగాలులు ఎదురుకావడం ఇదే మొదలు కాదు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన బీజేపీ హర్యానాలో చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా తృటిలో బతికి బయటపడింది. ఇక తెలంగాణ స్థానిక ఎన్నికల్లో స్థానాలు పెంచుకోగలిగినా హిందూ-ముస్లిం మతవిభజన కుట్ర పెద్దగా ఫలించ లేదు. బీజేపీ తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్ వంశాంకురం ధర్మపురి అరవింద్, లోక్ సభ ఎన్నికల్లో గెలవగలిగినా స్థానిక ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ముఖ్యంగా భైన్సా పరిణామాలు చూపించి హిందూ ఓట్లు నొల్లుకోవాలన్న అరవింద్ ప్రయత్నం సఫలం కాలేదు. నిజానికి కాంగ్రెస్ వైఫల్యం బీజేపీకి సహకరించినంతగా, మతోన్మాదం కలిసిరాలేదనేది స్పష్టం.
ఇలాంటి పరిణామాల నుంచి బీజేపీ నాయకత్వం పాఠం నేర్చుకున్న దాఖలాలు ఎక్కడా కనిపించడంలేదు! పిడుక్కీ, బిచ్చానికీ ఒకేమంత్రం పనికిరాదన్న ఇంగితజ్ఞానం బీజేపీ నాయక ద్వయానికి ఒంటబట్టినట్లు తోచదు. స్వయంగా ప్రధానమంత్రీ, ఆయనకు పక్కవాద్యంగా హోమ్ మంత్రీ సాగించిన ఎన్నికల ప్రచారం పరం పేలవంగా ఉండడం నిష్కారణమేం కాదు. ముక్కిపోయిన హిందుత్వ దుష్ప్రచారానికి మార్కెట్ లేకుండా చేసింది మోడీ-షా ద్వయమే! నోట్లరద్దు మొదలుకుని బీజేపీ ప్రభుత్వం తలపెట్టిన ప్రతి ఆర్ధిక ప్రయోగమూ ఘోరంగా విఫలమైంది. జైట్లీ-సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్లు ప్రజల ఆకాంక్షలకు యోజనాల దూరంలో ఆగిపోయాయి. అభివృద్ధి వేగం ఇసుమంతైనా పుంజుకోక పోగా నానాటికి తీసికట్టుగా నాసికట్టుగా దిగజారుతూ పోయింది. ఈ నేపథ్యమే, 2019 -20 ఎన్నికల ఫలితాలను నిర్ణయించాయి. ఈ చిన్న విషయం గ్రహించలేని జాతీయ నాయకుల చేతిలో ఎదురులేని అధికారం కేంద్రీకృతమై ఉందనే విషయం తల్చుకుంటే గుండె గుభేలుమంటుంది!
ఢిల్లీ ఎన్నికలు రంగం మీదికి తెచ్చిన ముఖ్యమైన చర్చనీయాంశం ఒకటుంది. ప్రతి ఎన్నికలకూ ఒక స్థానిక స్వభావం ఉంటుంది. దాని పరిధిలోనే ఎన్నికల ప్రచారం జరిగితే తప్ప ఓటర్లు అభ్యర్థులను పట్టించుకోరు. ఉదాహరణకి ట్రంప్ పనితీరు ఇతివృత్తంగా మన పార్లమెంటు ఎన్నికల ప్రచారం చేసిన పార్టీకి నాలుగు ఓట్లు రాలే అవకాశం ఉందా?
ఉదాహరణకి, ఢిల్లీ పౌరులు ఎదుర్కుంటున్న అతిపెద్ద సమస్య కాలుష్యం. ముఖ్యంగా మంచినీళ్లు కలుషితమై సామాన్యులు పడరాని పాట్లు పడుతున్నారక్కడ. ఆ సమస్యను వదిలిపెట్టి షాహీన్బాగ్ పరిణామాల గురించి గంటల తరబడి ప్రసంగించి ప్రయోజనమేమిటి? ఢిల్లీ పౌరులు ఎదుర్కునే మరోపెద్ద సమస్య కరెంటు సప్లై. ఆ సమస్యను వదిలిపెట్టి షాహీన్బాగ్ పరిణామాల గురించి గంటల తరబడి ప్రసంగించి ప్రయోజనమేమిటి? అలాగే ప్రతి పట్నంలోనూ, నగరంలోనూ వైద్య సౌకర్యాలు కరువై జనం అల్లాడుతున్నారు. ఢిల్లీ లోనూ అంతే! ఆ సమస్యను వదిలిపెట్టి షాహీన్బాగ్ పరిణామాల గురించి గంటల తరబడి ప్రసంగించి ప్రయోజనమేమిటి? ఈ విషయాన్ని కేజ్రీవాల్ అద్భుతంగా బయటపెట్టాడు. పనిలో పనిగా తన దైవభక్తిని గురించి కూడా ఆయన సందర్భోచితంగా చెప్పుకొచ్చాడు. ఫలితం మనమందరం చూస్తున్నాం! రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, హర్యానా, తెలంగాణ ఎన్నికల్లోనూ అదే పాట  – ఢిల్లీ ఎన్నికల్లోనూ అదే రోకటిపాట!  ఇలాంటి వైఖరి ఎటు దారి తీస్తుందో అంత  అనూహ్యమయిన విషయం కాదు.
అయినా, ఈ ఎన్నికల ఫలితాలు మరోలా ఉంటాయని బీజేపీ కార్యకర్తలెవరూ భావించినట్లు లేరు! అందుకే, ఒకానొక చోటామోటా నాయకుడు, “ఢిల్లీలో కేజ్రీవాల్ – కేంద్రంలో మోడీ!” అనే “నినాదం”తో లక్షల పోస్టర్లు వేసి అతికించాడట. అసలు, మనోజ్ తివారీ లాంటి మేధోసంపన్నుడి నిర్దేశకత్వంలో, మోడీ-అమిత్ షా మార్గదర్శకత్వంలో సాగిన బీజేపీ ఎన్నికల ప్రచారం ఆద్యంతం హాస్యాస్పదంగా సాగింది. మరికొద్ది సేపట్లో ఎన్నికల ఫలితాలు వెలువడ బోతాయనగా ఢిల్లీ లో బీజేపీ చరిత్ర సృష్టించ బోతోందని ప్రకటించిన సాహసి మనోజ్ తివారీ. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కిరాయి జర్నలిస్టుల కాకమ్మ కథలేనని కూడా వారు సెలవిచ్చారు. బీజేపీ ఈ ఎన్నికల్లో 68 స్థానాల్లో దిగ్విజయం సాధించడం ఖాయమని కూడా వారు ఢంకా బజాయించారు. అంతటి దూరదృష్టి, వాస్తవిక దృక్పథం వున్న మహానుభావుడి నాయకత్వ ఫలితం మరోలా ఎందుకుంటుంది?

-మందలపర్తి కిషోర్


Share

Related posts

మోదీ ఇంటర్వ్యూల్లో పస ఎంత?

Siva Prasad

జైలు కాదు..చిత్రహింసల కూపం!

Siva Prasad

ఓటమి అలవాటు చేయండి!

Siva Prasad

Leave a Comment