NewsOrbit
వ్యాఖ్య

ఏ పొయెట్రావెలాగ్

విమానం ఒక వింత పక్షి. దానికి కడుపులో కూడా రెక్కలుంటాయి. అవే ఎయిర్ హోస్టెస్ లు. లేకుంటే కూర్చున్నవాళ్లు కూర్చున్నట్టే ఎలా అలా ఎగురుతారు? ఆ మనోహర మాయావి రెక్కల సహారా లేకపోతే విహాయసంలో విహారం వీలయ్యేదేనా? ఇలాంటి ఆలోచనలే కలిగాయి మొన్న అండమాన్ వెళ్ళినప్పుడు. సముద్రానికి పన్నెండు కిలోమీటర్ల ఎత్తున దాదాపు గంటకు వేయి కిలోమీటర్ల వేగంతో విమానం దూసుకుపోతుంది. బయట తాపమానం మైనస్ నలభై డిగ్రీల కంటే తక్కువే వుంటుంది. అదంతా మనకేం తెలియదు. లోపల సమతుల్యమైన టెంపరేచర్ లో వుంటాం. పెద్దపెద్ద నగరాలు లక్క పిడతల్లా మారిపోతాయి. చూస్తుండగానే అవి అదృశ్యమై మబ్బులు మనల్ని చూడ్డానికి వచ్చినట్టు మన అద్దాలకు అవతల ఆటలాడుకుంటాయి. ఇంకా పైకి పోయినప్పుడు తెల్లని మబ్బులు దూది కొండల్లా కనిపిస్తాయి. వాటిల్లోంచి దూసుకుంటూ మన వింతరెక్కల పక్షి ఎగురతూ వుంటుంది. బొందితో కైలాసం మాటేమో గాని, బొందితో ఆకాశంలోకి ఎగరడం ఓ అద్భుతమైన అనుభవం. మన కాలికింద నేల మాయమైపోతుంది. క్రమక్రమంగా మనిషి నిర్మాణాలన్నీ మాయమైపోతాయి. ఈ విశాల విశ్వంలో మనిషి ఉనికి ఎంత సూక్ష్మమైనదో ఇలాంటప్పుడే అర్థమవుతుంది.
సంచారమే ఎంత బావున్నది అని గోరటెంకన్న పాడతాడు గాని యుగాలుగా మనిషి సంచరిస్తూనే వున్నాడు. భుక్తికోసం మనిషి చేసిన సంచారం వేరు. రొటీన్ జీవితం నుంచి కొన్ని రోజులైనా ముక్తి కోసం మనం చేసే సంచారం వేరు. చుట్టూ వేయి కిలోమీటర్ల విస్తీర్ణంలో మనల్ని చుట్టుకున్న సముద్రం మధ్య విహారం అపూర్య అనుభూతుల సమాహారం. సంచారం ఎందుకు బావుంటుందో కడలి నడిమధ్యలో ఊగుతున్న అలలమీద మన దేహాల నుంచి విడివడిన ఆత్మల నీడలు ఆడుకుంటున్న కేరింతలు చూసినప్పుడు బోధపడింది. ఏవేవో భాషల నుంచి ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఒక బోటులో కూర్చుని యుగాల బాంధవ్యం ఉన్నట్టు నవ్వులూ మాటలూ పాటలూ కలబోసుకున్నప్పుడు సంచారం మనుషుల మధ్య అన్న రకాల గోడల్ని కూల్చి వేసే అద్భుతమంత్రమే అనిపించింది. ఒకరి చేతులు ఒకరు పట్టుకుంటూ ఒకరి ఫోటోలు ఒకరు తీసుకుంటూ ఒకరి ముచ్చట్లు ఒకరు పంచుకుంటూ జట్లు జట్లుగా సాగించిన యాత్ర మనుషులు ఇంతకాలం తమ మధ్యలో గీసుకున్న అనేక మాయ విభజన రేఖల కపటత్వాన్ని మనకు చీల్చి చూపుతుంది. మనిషి ఎప్పుడూ సామూహిక సంచార సంతోష జీవి అని గుర్తు చేసుకోవడానికైనా అప్పుడప్పుడూ ఇలాంటి యాత్రలు చేయాలి.
అండమాన్ నికోబార్ లో సుమారు 500 పైగా దీవులుండాలి. ఇప్పుడు చిన్నా చితకా 30 దీవుల్లో మాత్రమే మనుషుల సంచారం వుంది. వాటిలో ఏడెనిమిది దీవులలోనే యాత్రికుల సందర్శనం వుంటుంది. ఇప్పటికీ మూలవాసులు మాత్రమే ఉన్న దీవులున్నాయి. అక్కడకు సభ్య సమాజ నాగరీకుల దురాక్రమణలు ఇంకా జరగలేదు. కొద్దిలో కొద్దిగా ప్రభుత్వం అక్కడి వాతావరణాన్ని కాలుష్యం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. పోర్టుబ్లెయిర్ లో సెల్యులర్ జైలు చూసినప్పుడు మన స్వాతంత్ర్య సమరయోధులు పడిన ఇక్కట్లు విన్నప్పుడు గుండె చెమర్చిన నీటిని భద్రంగా దాచుకుని పడవలో హ్యావలాక్ దీవికి బయలుదేరినప్పుడు సముద్రంలో ఆ నీటిని వొంపి అమరులకు అంజలి ఘటించాను. ఇదంతా పరాయి వారి పాలనలో సాగిన దుర్మార్గం. కాని స్వేచ్ఛాప్రియులను బంధించి వేధించడంలో వలసపాలకుల నుంచి మనవారు నేర్చుకున్న జైలు రాజకీయం తలుచుకుంటే ఇంకా బాధించింది.
సరే. సంచారంలో ఇంకా ఏం జరుగుతుందో నా అనుభవం మీకు చాలా చెప్పాలి. మనం పక్షులతో చెట్లతో స్వేచ్చగా తిరిగే జంతువులతో చాలా దగ్గరగా మాట్లాడవచ్చు. మనం ఏం చేయమని వాటికి ఒక భరోసా వుంటుంది. అంటే మనం బయటి ప్రపంచంలో ప్రకృతి పట్ల ఎంత క్రూరంగా వుంటున్నామో అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చన్నమాట. పగలు సూర్యుడు..రాత్రి చంద్రుడు కడలి దేహం మీద కిరణాల అక్షరాలతో రాసే కవిత్వాన్ని చదివి మురిసిపోవచ్చు. ఎలిఫెంటా బీచ్ కి వెళ్ళినప్పుడు సముద్రం మధ్యలో దాదాపు అరగంట పైకీకిందకీ ఊగే అలలపైన చుట్టూ ప్రశాంత సముద్రపు అందాలు చూస్తూనే ఊపిరి బిగబట్టి ప్రయాణించడం ఒక జీవన సత్యం చెప్పింది. ఈ క్షణంలో ఏమైనా జరిగితే అన్న ఆలోచన కలిగినప్పుడు జీవితం జీవించినప్పుడే అని, దాని ఆది అంతాల అంతరానంతరాల ఆలోచనలు అనవసరమని మనకు తెలిసిపోతుంది. అందరి మనసులో అలాంటి ఆలోచనలే వచ్చినట్టు అందరికీ తెలిసిపోయి అందరూ ఒకరినొకరు ఒక్కసారే చూసుకుని పకాలుమని నవ్వినప్పుడు అలలు అలలుగా సముద్రమూ గొంతుకలిపింది. అదే సంచారంలో ఉన్న ఆనందం అంటే.
బీచ్ మీద బికినీల పాపల్ని చూసినప్పుడు ఎంత ముచ్చట వేసిందో సముద్రం లోతులోకి మాస్కు తగిలించుకుని వెళ్ళి రంగురంగుల చేపల్న చూసినప్పుడు మనసుకి ఎప్పుడూ తెలియని మోహపారవశ్యమేదో ఆవహించింది. కడలి కడుపులో కోరల్ పేగుల్ని తాకినప్పుడు ఒళ్ళంతా సజల సంగీతమై ద్రవించిపోయింది. చూశారా ఎంత చిత్రమో. ఎప్పుడూ చూసిన మనుషులనే చూసి..చేసిన పనులే చేసి..అదే నిద్ర..అదే ఆహారం..మార్పులేని బతుకు నుండి ఒక సంచారం ఏ స్వప్న లోకాలకు తీసుకుపోతుందో కదా. తిరిగి వచ్చేసేటప్పుడు సముద్రాన్ని బెంగగా చూశాను. మమ్మల్ని తిప్పిన గైడ్ ఇక్కడ మీకేం నచ్చింది అని అడగలేదు. ఇక్కడ మనుషులు నచ్చారా అని అడిగాడు. పైసా కోసం కక్కుర్తిపడిన వాడెవడూ కనిపించలేదు. అక్కడి మనుషుల్లో ఇంకా స్వచ్ఛత..నిజాయితీ మూల వాసుల్లో ఉండే అమాయకత్వం కనిపించాయి. శిశువు గురించి జాషువా అన్నట్టు ఏండ్లు గడిచిన ముందు ముందేమొ గాని ఇప్పుటికి మాత్రం ఏ పాపమెరుగరు. అందుకే ఒకసారైనా అండమాన్ వెళ్ళండి. మనం కడుక్కోవలసినవి చాలా వున్నాయి. అవేంటో అక్కడి సముద్రానికి తెలుసు. అది మనల్ని అలల చేతులతో శుభ్రం చేసి పంపుతుంది. అన్నట్టు మరచాను. ఫిబ్రవరి తొమ్మిది మా స్పెషల్ డే. హ్యావలాక్ దీవిలో ఆ ఉదయం కడలి ముంగిట మా రాజి ఒక ముగ్గు వేసింది. రాజీ ప్రమూ @ 35 అని. ఆ ఏకవాక్య కవిత నా గడిచిన కాలాల స్మృతుల పుష్పాన్ని రేకులు రేకులుగా విప్పి కొత్త పరిమళాలు అద్దింది.

డా. ప్రసాదమూర్తి

author avatar
sharma somaraju Content Editor

Related posts

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Saranya Koduri

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Allu Arjun: బన్నీ కి భారీ షాక్ ఇచ్చిన శ్రీ లీల… ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Venkatesh: వెంకీ మామా ఏంటి నీకు ఈ ఘోర అవ‌మానం… ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌..!

Saranya Koduri

Charmi: ” నీ హగ్గులు, లవ్ చాలా మిస్ అవుతున్నా.. తిరిగి మళ్లీ నా లైఫ్ లోకి రా “.. చార్మి సెన్సేషనల్ పోస్ట్..!

Saranya Koduri

Chiranjeevi: చిరు ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సీఎం కి కూడా ఈ రేంజ్ ఉండదేమో..!

Saranya Koduri

Balakrishna: బాల‌య్య ప‌క్క‌న ఆ హీరోయిన్… ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్రా బాబు..!

Saranya Koduri

Junior NTR: నందమూరి ఫ్యామిలీ తారక్ ని అందుకే దూరం పెడుతుందా.. బయటపడ్డ అసలు నిజం..!

Saranya Koduri

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Saranya Koduri

Samantha: జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను అంటూ మరోసారి తన ఆవేదనను బయటపెట్టిన సమంత..!

Saranya Koduri

నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ

Deepak Rajula

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment