NewsOrbit
వ్యాఖ్య

చలికాలపు “వడ”గాలులు!

మా చిన్నప్పుడు సాంఘిక శాస్త్ర వాచకంలో, “భారత దేశము లోని వాతావరణ పరిస్థితిని సమశీతోష్ణ స్థితి అందురు” అని చదువుకున్నాం. అంతేకాదు- సమశీతోష్ణ స్థితి నెలకొనివున్న దేశాల్లో ఎండాకాలంలో వేడిగానూ, శీతాకాలంలో చల్లగానూ ఉంటుందని కూడా చదువుకున్నాం. అయితే, 2019 శీతాకాలంలో దేశమంతటా “వడ” గాలులు వీచడం చూసి ఆశ్చర్యమనిపించింది! అంతకు మించి, మనపాలకులే ఈ “వడ” గాలులు వీచేలా ప్రత్యేక ఏర్పాట్లు చెయ్యడం మరింత విడ్డూరంగా కూడా అనిపించింది. అయితే, పాలకులు ఏంచేసినా అందులో ఎంతెంతో అంతరార్థం ఉంటుందని మనకు తెలుసు కనక, అదేమిటో గ్రహించే ప్రయత్నం చేస్తున్నామిక్కడ- అంతేనయ!
మా చిన్నప్పటి సాంఘిక శాస్త్ర వాచకాలు రాసినవాళ్ళు మామూలు మేస్టార్లు. అసలు శీతోష్ణ స్థితి గురించి వాళ్లకి ఏమైనా తెలుసా తెలీదా? అనే అనుమానం వస్తోందిప్పుడు. ఎందుకంటే, ఇప్పుడు దేశమంతటా “వడ”గాలులు వీయిస్తున్న వాళ్ళేమన్నా తక్కువ వాళ్ళా? పరమ శివుడే తొలి ప్లాస్టిక్ సర్జెన్ అంటూ -సాక్షాత్తూ సైన్స్ కాంగ్రెస్ వేదిక మీదనుంచే- ఢంకా బజాయించిన విజ్ఞాన ఖనులు వారు! మంచుకురిసే వేళ లో సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన పక్షంలో ఆ విషయం రాడార్లు పసిగట్టలేవని సైనిక నిపుణులకు సలహా చెప్పిన మేధావులు వారు! శ్రీహరికోట అంతరిక్ష నౌకా ప్రయోగ కేంద్రంలో చంద్రయాన్-2 లాంటి కీలక ఘట్టం జరుగుతున్న వేళ, స్వయంగా దగ్గిరుండి- వ్యవహారం మొత్తం పర్యవేక్షించిన మహానుభావులు వారు. ఇక,   ఆర్ధిక విధానాల రంగంలో ఒకదానితర్వాత మరొకటిగా ప్రయోగాలు చేస్తూ, రఘురాంరాజన్ లాంటి ప్రపంచ ప్రసిద్ధ ఆర్ధిక నిపుణులకు అదురుపుట్టిస్తున్న సాహస వీరులు వారు! అలాంటి ప్రవాచకులతో, సాదాసీదా వాచకాలు రాసుకునే మేస్టార్లను పోల్చడానికి ఎంత గుండె ధైర్నం ఉండాలి?
ఇంతకీ, కాలం కాని కాలంలో, ఈ “వడ” గాలులు ఎందుకు వీస్తున్నట్టు?
సదరు “వడ” గాలుల ద్వారా సాధించ దలిచిన మహత్తరమైన ఆ యొక్క ప్రయోజనం ఏమిటి??
ఈ ప్రశ్నలకు సూటిగా గానీ, నిజాయితీతో కానీ మన ప్రభువులు  సమాధానం చెప్పడం లేదు. నెలకు మూడు వానలు క్రమం తప్పకుండా కురిసేలా చెయ్యడానికే – ఇంటింటా ధాన్యలక్ష్మి నాట్యం చెయ్యడానికే- అన్ని ఋతువులూ, పంచాంగంలో రాసినట్టుగా ఠంచనుగా రావడానికే- ఈ “వడ” గాలులు వీయిస్తున్నామని ప్రభువుల ఉవాచ! అందులో నిజమెంతో అనుభవసారం వడగట్టిన మన ప్రజలకు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు! అయినప్పటికీ, సర్కారు వారి తరఫున సోషల్ మీడియాలోని ప్రభువర్గాల అస్మదీయులు అసలు విషయం కుండబద్దలు కొట్టి మరీ చెప్తూనే ఉన్నారు!
అస్మదీయులు కానివాళ్లను -అనగా, “మాయాబజార్” భాషలో తసమదీయుల్ని-ఎక్కడికక్కడ వడగట్టి పారేయడమే ఈ “వడ”గాలుల లక్ష్యం అనిచెప్పి సోషల్ మీడియా లో పాలకపక్షీయులు కొందరు తెగబడి చెప్తున్నారు. “ఇంతకీ ఎవరయ్యా ఈ తసమదీయులు?” అంటారేమో, చిత్తగించండి! సదరు తసమదీయులు మన “సంఘం” సభ్యులు కాకపోవచ్చు-  మన పార్టీవాళ్ళు  కాకపోవచ్చు- మన మతస్థులు కాకపోవచ్చు- మన కులస్థులు కాకపోవచ్చు- గత రెండు ఎన్నికల్లో ఒక్కసారి కూడా మనకి ఓటు వేసినవాళ్లు అయివుండకపోవచ్చు- మనకు పెద్దగా భిన్నం కాని “ప్రతిపక్షానికి” ఓటు వేసిన వాళ్ళు కావచ్చు- లేదా, కుళ్ళి గవులు కంపు  కొడుతున్న మన మహోన్నత సదాచారాలను విమర్శించే “కుసంస్కారులు” కావచ్చు- మనకి నచ్చని రీతిలో వస్త్రధారణ చేసుకునేవాళ్లూ కావచ్చు- మనకి రాని భాషలు వచ్చిన వాళ్ళు సైతం కావచ్చు- ఒక్క మాటలో చెప్తే, మనకి నచ్చని వాళ్ళెవరైనా సరే “తసమదీయులే!” ముందుగా పౌరసత్వ జాబితాల్లోంచీ, తదనంతరం జనాభా లెక్కల జాబితాల్లోంచీ, ఈ తసమదీయుల్ని వడగట్టే ప్రయత్నం అధికారికంగా మొదలైంది 2019 శీతాకాలంలోనే. అందుకే వాటిని చలికాలపు “వడ”గాలులు అనేది!
సామాన్య దేశవాసుల గురించిన “సమగ్ర గుర్తింపు సమాచారం” రూపొందించడమే ఈ యొక్క “జాతీయ జనాభా పట్టిక” యొక్క లక్ష్యమని ప్రభువులు విన్నవిస్తున్నారు. దాని మాట అలా ఉంచండి- ఎందుకంటే, ఈ జాతీయ జనాభా పట్టిక నిజానికి ఇంకా రంగం మీదికి రాలేదు. ప్రస్తుతం సా……..గుతున్న అంకం పేరు పౌరసత్వ (సవరణ) బిల్లు అను చట్టం. ఇది “అల్పసంఖ్యాకులు” అనే పేరిట హిందుత్వ వాదులు ప్రేమగా పిల్చుకునే విభిన్న వర్గాల మధ్య చిచ్చు రగిలించడానికే   పుట్టుకొచ్చిందని  ప్రముఖ సంపాదకులూ, రచయితలూ, కళాకారులూ, మేధావులూ, మరియూ ఇప్పుడిప్పుడే కళ్ళుతెరుస్తున్న బుద్ధిజీవులు -అనగా, విద్యార్థులూ- అంటున్నారు. ముందు ముందు కథ మరిన్ని ఆసక్తికరమైన మలుపులు తిరిగే సూచనలున్నాయన్నది ఈ బుద్ధిజీవుల హెచ్చరిక!
ఉదాహరణకి, “హిందువులు”గా గుర్తింపు పొందినప్పటికీ హిందుత్వ వాదాన్ని సమర్ధించనివారిని ఈ జాబితాల్లోంచి “వడగట్టే” సౌకర్యం ప్రభువులకు ఎప్పుడూ ఉంటుంది. అదేవిధంగా, జనన పత్రాలనూ- తమ తాత తండ్రులు ఈ గడ్డమీదే పుట్టిపెరిగినట్లు రుజువు చేసే అధికారిక పత్రాలనూ  చూపించలేని అట్టడుగు బీదా బిక్కీ వర్గాలనూ ఈ జాబితాల్లోంచి “వడగట్టే” సౌకర్యం కూడా  ప్రభువులకు ఉంటుంది. ఇలా మరెందరినో ఈ “వడ”గాడ్పులు వడగట్టేయగలవు!
సమశీతోష్ణ స్థితి నెలకొనివున్న దేశాల్లో ఎండాకాలంలో వణుకు పుట్టించే శీతవాయువులు వీచే అవకాశం ఉందని కానీ, శీతాకాలంలో  గూబలు గుయ్యిమనిపించే వడగాలులు వీచే ప్రమాదం ఉంటుందని గానీ మా చిన్నప్పటి సాంఘిక శాస్త్ర వాచకాల్లో చదువుకో లేదు. అవును మరి- మేం చిన్నప్పుడు చదువుకున్నది సోషల్ వాచకమాయె; ఇప్పుడు వడగాలులు వీయిస్తున్నది యాంటీ సోషల్ ప్రవాచకులు కదా! అదీ కథ!
ఈ కాలమ్ చదివే వాళ్లలో చాలామంది -రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంగా- జర్మన్ లూథరన్ మతాధికారి మార్టిన్ నిమోలర్ చేసిన “కన్ఫెషన్” చూసే వుంటారు. మరొక్కసారి వాళ్లకి ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఆ పశ్చాత్తాప ప్రకటనను గుర్తుచేయాలనిపిస్తోంది.

“ముందుగా వాళ్ళు సోషలిస్టుల కోసం వచ్చారు;
అప్పుడు నేను మౌనం వహించాను-
ఎందుకంటే మరి, నేను సోషలిస్టును కాను!

తర్వాత, వాళ్ళు  ట్రేడ్యూనియనిస్టుల కోసం వచ్చారు;
అప్పుడు కూడా నేను మౌనం వహించాను-
ఎందుకంటే మరి, నేను ట్రేడ్యూనియనిస్టును కూడా కాను!

ఆ తర్వాత, వాళ్ళు యూదుల కోసం వచ్చారు;
అప్పుడు కూడా నేను మౌనం వహించాను-
ఎందుకంటే మరి, నేను యూదునూ కాను!

చివరికి, వాళ్ళు  నా కోసమే వచ్చారు;
కానీ నా కోసం గొంతెత్తి మాట్లాడ్డానికి ఒక్కడూ మిగల్లేదు!”

నిమోలర్ ప్రకటించిన పశ్చాత్తాపం తిరిగి ప్రకటించాలని అనుకోని వాళ్లంతా ఈ చలికాలపు “వడ”గాలులను తిప్పికొట్టక తప్పదు!

 

 – మందలపర్తి కిషోర్

author avatar
sharma somaraju Content Editor

Related posts

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Saranya Koduri

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Allu Arjun: బన్నీ కి భారీ షాక్ ఇచ్చిన శ్రీ లీల… ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Venkatesh: వెంకీ మామా ఏంటి నీకు ఈ ఘోర అవ‌మానం… ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌..!

Saranya Koduri

Charmi: ” నీ హగ్గులు, లవ్ చాలా మిస్ అవుతున్నా.. తిరిగి మళ్లీ నా లైఫ్ లోకి రా “.. చార్మి సెన్సేషనల్ పోస్ట్..!

Saranya Koduri

Chiranjeevi: చిరు ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సీఎం కి కూడా ఈ రేంజ్ ఉండదేమో..!

Saranya Koduri

Balakrishna: బాల‌య్య ప‌క్క‌న ఆ హీరోయిన్… ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్రా బాబు..!

Saranya Koduri

Junior NTR: నందమూరి ఫ్యామిలీ తారక్ ని అందుకే దూరం పెడుతుందా.. బయటపడ్డ అసలు నిజం..!

Saranya Koduri

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Saranya Koduri

Samantha: జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను అంటూ మరోసారి తన ఆవేదనను బయటపెట్టిన సమంత..!

Saranya Koduri

నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ

Deepak Rajula

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment