అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసేందుకు జగన్ సర్కార్ ఏర్పాటు చేసిన కమిటీ పలు సూచనలతో కూడిన నివేదికను సిద్ధం చేసింది. ఈ కమిటీ ఛైర్మన్ ఆంజనేయరెడ్డి నేతృత్వంలో విలీనం విధివిధానాలపై కమిటీ అధ్యయనం చేసింది. ఇవాళ మధ్యాహ్నం సీఎం జగన్కు నివేదిక ఇవ్వనుంది. విలీనంపై ఐదు రకాల విధానాలను సిఫార్సు చేయనున్నట్లు సమాచారం.
డీజిల్ ధరలు పెరగడంతో సంస్థకు నష్టాలు వస్తున్నందున ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెట్టడంపైనా కమిటీ నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే మెరుగైన నిర్వహణ విధానాలపైనా ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. మరోవైపు రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో నివేదికపై చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎన్నికల హామీలో భాగంగానే సీఎం జగన్.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేశారు. .
రాష్ట్ర విభజనం అనంతరం విజయవాడ కేంద్రంగా ఏపీఎస్ఆర్టీసీ కార్యకలాపాలు సాగుతున్నాయి. కొన్నేళ్లుగా అద్దె బస్సులు, తాత్కాలిక సిబ్బంది నియామకాలు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీకి 11,678 బస్సులున్నాయి. అందులో 8964 బస్సులు సంస్థకు చెందినవి కాగా, మరో 2714 బస్సులు అద్దె ప్రాతిపదికన నడిపిస్తున్నవి. రాష్ట్ర వ్యాప్తంగా 126 బస్సు డిపోలు, 426 బస్సు స్టేషన్ల ఉన్నాయి. ఇటీవల సంస్థ ఏసీ బస్సుల నిర్వహణ మీద దృష్టి పెట్టింది. వెన్నెల, అమరావతి, గరుడ, ఇంద్ర వంటి సర్వీసులను తీసుకువచ్చింది. సూపర్ లగ్జరీ, డీలక్స్, మెట్రో డీలక్స్తో పాటుగా పల్లె వెలుగు సర్వీసుల ద్వారా అనేక గ్రామీణ ప్రాంతాలు, సిటీ బస్సులతో నగర ప్రాంతాలను సేవలు అందిస్తోంది. ఏపీతో పాటు తెలంగాణ,మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల్లోనూ ఏపీఎస్ఆర్టీసీ సర్వీసులు నడుస్తున్నాయి.
ప్రభుత్వం లెక్కల ప్రకారం ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీకి రూ. 6 వేల కోట్లకుపైగా అప్పులు ఉన్నాయి. ఆర్టీసీ భారీ నష్టాల్లో కూరుకుపోవడానికి అనేక కారణాలున్నాయి. ప్రైవేటు ఆపరేటర్ల నుంచి పోటీ, చమురు ధరలు, నిర్వహణ లోపాలు, రాయితీల వ్యయాన్ని ప్రభుత్వం రీఎంబర్స్ చేయకపోవడం వంటివి వీటిలో ప్రధానమైనవని. ఆర్టీసీ ఆదాయం ప్రతి ఏటా పెరుగుతోంది. కానీ నిర్వహణ వ్యయం అంతకంటే ఎక్కువ అవుతోంది. దీంతో నష్టాలు వస్తున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఉద్యోగ భద్రత, ఇతరత్రా ప్రయోజనాలు దక్కుతాయన్న ఆశతో కార్మిక సంఘాలు విలీనం డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తున్నాయి.