వంశీ మార్గాన్నే అనుసరించబోతున్న మద్దాలి గిరి?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బాటలోనే గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి నడుస్తారా? వైసీపీలో డైరెక్ట్ గా చేరకుండా వంశీ మాదిరిగా ఆపార్టీకి మద్దతు ఇస్తారా ? ప్రస్తుతం ఇదే అంశంపై ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పరిస్థితి అయోమయంగా తయారైంది. ఏ నాయకుడు ఎప్పుడు జంప్ అవుతాడో అర్థంకాని పరిస్థితి నెలకుంది. ప్రస్తుతం రాజధాని విషయంలో టీడీపీ నాయకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది సీఎం జగన్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే.. గంటా, కొండ్రు మురళి లాంటి ఉత్తరాంధ్ర సీనియర్ నాయకులు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. అయితే, టీడీపీ అధిష్టానం మూడు రాజధానుల ప్రతిపానను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో పార్టీలోని కొందరు నాయకులు చంద్రబాబు తీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి సోమవారం సీఎం జగన్‌ను కలుసుకోవడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో కలిసి సీఎంను కలిసిన గిరి..పలు విషయాలను జగన్‌తో చర్చించారు. దీంతో మద్దాలి గిరి వైసీపీలో చేరతారనే ప్రచారం కూడా జోరందుకుంది.

నిజానికి గన్నవరం ఎమ్మెల్యే వంశీ బాటలోనే మరి కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరుతారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మద్దాలి గిరి సీఎంతో భేటీ ప్రాథాన్యాత సంతరించుకుంది. అంతేకాదు సీఎం జగన్ కార్యదక్షత ఉన్న నాయకుడని, సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నారని ప్రశంసించారు. దీంతో ఆయన వైసీపీలో చేరడం ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాను టీడీపీని వీడడం లేదని చెప్పినప్పటికీ పార్టీ అధినేత చంద్రబాబును విమర్శిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం చూస్తే ఆయన వంశీ దారిలోనే వెళ్తున్నట్లు తెలుస్తోంది. గతంలో వల్లభనేని వంశీ కూడా ఇలాగే సీఎంను కలిసి ఆ తర్వాత టీడీపీతో విభేదించి..పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని స్పీకర్‌ను కోరారు. ఈ నేపథ్యంలో మద్దాలి గిరి కూడా వంశీ మార్గాన్నే అనుసరించబోతున్నారని తెలుస్తోంది. సీఎం జగన్ అభివృద్ది బాటలో పయనిస్తున్నారని.. నియోజకవర్గ పనుల కోసమే సీఎంను కలిసినట్టు ఎమ్మెల్యే గిరి తెలిపారు. టీడీపీ హయాంలో గుంటూరు అభివృద్దికి నోచుకోలేదని, పేర్కొన్నారు. రైతులు రాజధాని విషయంలో అపోహలు వీడాలని..చంద్రబాబు ద్వందవైఖరి అవలంభిస్తున్నారని చెప్పారు. తన ప్రవర్తన పార్టీకి నచ్చని పక్షంలో ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని స్పీకర్‌ను మద్దాలి గిరి కోరనున్నారని ప్రచారం జరుగుతోంది.

మరోవైపు మద్దాలి గిరి వ్యవహారం టీడీపీలో కలకలం రేపాయి. ఆయన జగన్‌కు జైకొట్టారో లేదో.. టీడీపీ వేగంగా పావులు కదిపింది. నష్ట నివారణ చర్యలు చేపట్టింది. పశ్చిమ టీడీపీ ఇన్‌చార్జ్‌గా కోవెలమూడి రవీంద్రను అధినేత చంద్రబాబు నియమించారు. ఆయన నియోజకవర్గ బాధ్యతల్ని రవీంద్రకు అప్పగించినట్లు సమాచారం. అయితే, మద్దాలి గిరి టీడీపీ రాజీనామా చేస్తారా? లేదా ? అన్నది రాజకీయ వర్గాల్లో సస్పెన్స్ గా మారింది.