(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ప్రాణపాయ స్థితిలో ఉన్న తన స్నేహితురాలి కోసం ఓ బాలిక.. మొసలితో పోరాడింది. తన ప్రాణాలకు తెగించి స్నేహితురాలి ప్రాణాలు కాపాడింది. ఈ ఘటన జింబాబ్వేలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… సిండరేలా అనే గ్రామంలో లయోటా మౌవానీ(9), ఆమె స్నేహితురాలు రెబెకా ముంకోబ్వే(11) సహా మరికొందరితో కలిసి ఓ చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లింది. ఈ సమయంలో ఉన్నట్టుండి.. ఓ మొసలి హఠాత్తుగా లయోటాపై దాడి చేసింది. లయోటాని నోటతో కరిచి నీటిలోకి లాక్కెళ్లింది. దీంతో ఆమె భయంతో గట్టిగా కేకలు వేసింది. అది గమనించిన రెబెకా తన స్నేహితురాలిని ఎలాగైనా కాపాడాలి అనుకుంది. అప్పుడామెకు అది క్రూర జంతువా మరోటా అన్నది చూసుకోలేదు. లయోటాను లాక్కెళ్తున్న మొసలి వీపుపైకి అమాంతం దూకింది. తన శక్తిమేర మొసలితో యుద్ధం చేసింది. ఆపై తన చేతివేళ్లతో దాని కళ్లు పీకేసింది. దీంతో ఆ మొసలు నొప్పితో విలవిలలాడింది. లయోటాను వదిలి నీళ్లలోకి పారిపోయింది. వెంటనే రెబెకా, లయోటాను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చింది.
అక్కడున్నవారిలో తానే అందరికంటే పెద్దదాని అని.. తోటి స్నేహితురాలిని లాక్కెళ్తుంటే మరో ఆలోచన లేకుండా దానిపై దూకేశానని రెబెకా తెలిపింది. అదృష్టవశాత్తు రెబెకాకు ఎలాంటి గాయాలు కాలేదు. స్వల్ప గాయాలైన లయోటా మౌవానీ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని డాక్టర్లు తెలిపారు. తన కూతురిని కాపాడినందుకు లయోటా తండ్రి రెబెకాకు ధన్యవాదాలు తెలిపాడు. రెబెకా చేసిన సాహసానికి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. తన ప్రాణాలకు తెగించి స్నేహితురాలి ప్రాణాలు కాపాడిన రెబెకాను అభినందనలతో ముంచెత్తుతున్నారు.