న్యూఢిల్లీః కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు… శ్రీనగర్ వెళ్లిన అఖిలపక్ష నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. పర్యటనకు పర్మిషన్ లేదంటూ వారితో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుపై రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్య పాల్ మాలిక్ ఆహ్వానం మేరకే తాము వచ్చామని, తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొని ఉంటే.. ప్రభుత్వం తమ పర్యటనను ఎందుకు అనుమతించడం లేదని రాహుల్ నిలదీశారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు లేవనే విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో షేర్ చేసింది.
The govt is saying everything is okay here & everything is normal. If everything is normal why are we not allowed out?: Shri @RahulGandhi
Was it not Governor Satya Pal Malik that invited Mr. Gandhi to come to J&K and assess the situation for himself? #RahulGandhiWithJnK pic.twitter.com/jneIkpOJve
— Congress (@INCIndia) August 24, 2019
ఆర్టికల్ 370ని రద్దు తర్వాత కాశ్మీర్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై రాహుల్ బృందం పరిశీలించాలని భావించింది. ఈ నేపథ్యంలోనే రాహుల్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, సీపీఐ(ఎం) నేత సీతారాం ఏచూరి, సీపీఐ నేత రాజా, ఆర్జేడీ నేత మనోజ్ ఝా, టీఎంసీ నాయకుడు దినేశ్ త్రివేది, డీఎంకేకు చెందిన తిరుచి శివ తదితరులు శనివారం శ్రీనగర్ కు వెళ్లారు. అయితే, పర్యటనకు అనుమతి లేందుంటూ పోలీసులు వారిని తిరిగి ఢిల్లీకి పంపించారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో రాజకీయ నాయకుల పర్యటనకు ప్రభుత్వం అనుమతించడం లేదు. గతంలో రెండుసార్లు ఆజాద్‌ను శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో అడ్డుకున్న భద్రతా సిబ్బంది ఆయన్ను బలవంతంగా ఢిల్లీకి పంపిన సంగతి తెలిసిందే.
మరోవైపు జమ్మూకశ్మీర్‌లో మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సహా సుమారు 400 మంది నాయకులను ప్రభుత్వం బంధించింది. కశ్మీర్ లోయలో ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే అక్కడ జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్రం జమ్మూ కశ్మీర్‌ను రెండుగా విభజించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్న తరుణంలో రాజకీయ నేతలెవరూ శ్రీనగర్ రావొద్దని రాహుల్ పర్యటనకు ముందు రోజున జమ్మూ కశ్మీర్ ఐ అండ్ పీఆర్ డిపార్ట్మెంట్ ట్వీట్ చేసింది.