కూడికలూ- తీసివేతలూను!

“ప్రకృతి మొత్తం పంచేంద్రియాల కూడికలూ తీసివేతలే” అన్నాడట ఓ తాత్వికుడు. దాని మాట ఎలావున్నా మన ప్రభుత్వాల విధానాలు మొత్తం కూడికలూ తీసివేతల సమాహారమేనని కేంద్ర ప్రభుత్వం మరోసారి రుజువు చేసింది. ముఖ్యంగా పౌరసత్వ (సవరణ) బిల్లు- క్యాబ్- ఇదే విషయాన్ని చాటిచెపుతోంది. మనకాలపు కౌటిల్యుడు అమిత్ షా ఈ విషయంలో పెద్ద దాపరికం కూడా చూపించడం లేదు. బీజేపీకి ఓట్లు వేసే అవకాశం అణువంతయినా లేని మతస్థులని పౌరసత్వ జాబితా లోంచి తీసివేయడానికి షా ఓ తెలివయిన విధానాన్ని ప్రవేశ పెట్టారు. అదే క్యాబ్. ఈ బిల్లు లోని ఆంతర్యాన్ని “ద హిందూ” పత్రిక సంపాదకుడు జి.సంపత్ ఇటీవల రచ్చకెక్కించారు. సంపత్ బయట పెట్టినదాని ప్రకారం, క్యాబ్ అసలు స్వరూపం, స్వభావం, దాన్నుంచి కేంద్రం ఆశిస్తున్న ప్రయోజనం ఇదీ-
దశలు దశలుగా -భిన్న కాలాల్లో- ఇతర దేశాల నుంచి మన దేశంలో ప్రవేశించి స్థిరపడిపోయిన భిన్నమతస్థుల లెక్కలు అందులో భాగంగా సేకరిస్తారు. ఈ జాబితాలో ముస్లిములతో పాటుగా బౌద్ధులూ, క్రైస్తవులూ, పారసీలూ, జైనుల జనసంఖ్య ఎంతెంత ఉందో లెక్క తీస్తారు. అటుతర్వాత, అందులోంచి బౌద్ధులూ-జైనులూ-పారసీలూ-క్రైస్తవుల సంఖ్య కూడి దాన్ని మొత్తం శరణార్ధుల సంఖ్య లోంచి మినహాయిస్తారు. ఫలితంగా ఈ దేశంలో ముస్లిముల సంఖ్య నికరంగా ఎంతో తేలిపోతుంది! అదే కేంద్ర హోమ్ శాఖామాత్యుడు -మనకాలపు కౌటిల్యుడు కూడా- అయినా అమిత్ షా కి కావలసిన సమాచారమని సంపత్ విశ్లేషణ.
“నీ ముక్కు ఎక్కడుంది?” అని ఎవరో అడిగితే, ఓ బుద్ధిమంతుడు తన చూపుడువేలిని తలచుట్టూ తిప్పి ముక్కు కొస ఎక్కడుందో చూపించాడట! క్యాబ్ కసరత్తు అంతే తెలివిగా ఉందని పైకి అనిపించవచ్చు.కానీ ఇది కౌటిల్యుడు పుట్టిన గడ్డ మహాశయా!! ఇక్కడ ఆయన వారసులు ప్రతి తరం లోనూ జన్మిస్తుంటారు. ఇందులోని కౌటిల్యం ఎక్కడుందో చూద్దాం పదండి-
క్రీస్తుకు పూర్వం నాలుగు- మూడు శతాబ్దాలకు చెందిన మౌర్య చంద్రగుప్తుడు సవతి సోదరులను నిర్మూలించే లక్ష్యానికి మార్గదర్శకత్వం వహించగల గురువును వెతుక్కుంటూ వెళ్తుంటే ఆయనకు కౌటిల్యుడు కనిపించాడట. సదరు కౌటిల్యుడు అంతకు ముందు చాణక్యుడనే పేరిట ప్రసిద్ధుడని చెప్తారు. సంస్కృతంలో “చణక” శబ్దానికి శెనగ అనే అర్థమట. కేరళ ప్రాంతంలో విస్తృతంగా పండే శెనగల్ని చాణక్యుడు ఉత్తర భారత దేశానికి ఎగుమతి చేసి ఇబ్బడిముబ్బడిగా లాభాలు సంపాదించాడట. అతగాడి సంపద చూసి ఓర్వలేకపోయిన ధన నందుడూ, అతని కుమారులు నవనందులూ చాణక్యుని దోచేశారట. అందుకని చాణక్యుడు వాళ్ళమీద కత్తిగట్టి ఉన్నాడు. అతన్ని కలిస్తే, చంద్రగుప్తుడి బలం పెరుగుతుందని ఎవరో సలహా ఇస్తే చాణక్యుని వెతుక్కుంటూ చంద్రగుప్తుడు వచ్చాడని ఓ ఐతిహ్యం.
చంద్రగుప్తుడు చాణక్యుడి దగ్గిరకి మారువేషంలో వెళ్ళాడట. అతని కళ్ళముందు ఓ విచిత్ర సంఘటన జరిగిందట. చాణక్యుడి కాల్లో అప్పుడే తుమ్మముల్లు గుచ్చుకుంది. చాణక్యుడు నేర్పుగా ముల్లుతీసి, తన గుడిసెలోకి వెళ్లి పెద్ద బెల్లంముక్క తీసుకొచ్చాడట. దాన్ని ఓ కుండలోని నీళ్లలో జాగ్రత్తగా కలిపాడట. ఆ నీళ్లను సదరు తుమ్మముక్క మొదట్లో పోశాడట.
అది చూసేసరికి చంద్రగుప్తుడికి నీరసం పుట్టుకొచ్చింది. ఇటువంటి కరుణార్ద్ర రసహృదయుడు తన లక్ష్య సాధనకు ఎందుకు పనికొస్తాడనే ప్రశ్న కూడా తలెత్తింది. తిన్నగా చాణక్యుడి దగ్గిరకెళ్ళి తానెవరో, ఎందుకొచ్చాడో చెప్పాడట. తన కాల్లో ముళ్ళు దించిన తుమ్మమొక్క మొదట్లో పానకం పోసిన చాణక్యుడి ప్రవర్తన లోని అంతస్సారం బోధపడలేదని వినయంగా చెప్పాడట.
అప్పుడు చాణక్యుడు చిరునవ్వు నవ్వి, “పిచ్చి చంద్రగుప్తా! నేను ఆ తుమ్మమొక్కను క్షమించనూ లేదు- ప్రేమించడమూ జరగదు!! ఈ పానకం వాసనకి చుట్టుపక్కల ఉన్న కండ చీమలన్నీ తుమ్మమొక్క మొదట్లో చేరతాయి. అప్పటికి తుమ్మమొక్క వేళ్ళు ఆ పానకం కొంత పీల్చుకుని ఉంటాయి. కండ చీమలు ఆ వేళ్లన్నిటినీ కొరికిపారేస్తాయి. దాంతో ఆ మొక్క చస్తుంది! మనపని ఇతరులచేత చేయించుకోవడమే రాజ్యతంత్రం యొక్క సారాంశం నాయనా!!” అని తొలిపాఠం చెప్పాడట.
“స్వామీ, తుమ్మమొక్క చచ్చినా, కండ చీమల బెడద పెరుగుతుంది కదా?” అని చంద్రగుప్తుడు అమాయకంగా అడిగాడట.
“పిచ్చి చంద్రా, ఆ చీమలకు మాత్రం దక్కేది ఏముంటుంది? పానకంలో సగం, అప్పటికే మొక్క కాండానికి చేరిపోయి ఉంటుంది కదా! మిగిలేది పానకం తాలూకు వాసన మాత్రమే నాయనా! దాన్ని కోసం ఎగబడి కండచీమలు ఒకదాని కాళ్ళు మరొకటి తొక్కుకుని అక్కడే చచ్చిపడతాయి. కాస్సేపు ఉంటే అదంతా నీ కళ్ళతో నువ్వు చూడొచ్చు!!” అని చిద్విలాసంగా నవ్వాడట.
తనకు తగిన గురువు దొరికినందుకు సంతోషించి చంద్రగుప్తుడు కౌటిల్యుడి దగ్గిరే సెటిల్ అయిపోయాడట. తర్వాతి కథ చరిత్ర కెక్కింది!
మన కాలపు కౌటిల్యుడు కూడా ఇదే టెక్నీక్ మన దేశకాల పరిస్థితులకు తగినట్లు అనుసరిస్తున్నాడు. ముందుగా మైనారిటీల మధ్య చిచ్చు పెడుతున్నాడు. హిందువుల తొమ్మిదో అవతారమైన బుద్ధుడిని కొలిచే బౌద్ధులను తన ధృతరాష్ట్ర కౌగిట్లోకి చేర్చుకుంటున్నాడు. ఇక్కడ ఎన్ని కోట్ల మంది బౌద్ధుల్ని ఊచకోత కోశారో ఈ కాలపు బౌద్ధులకు ఏమెరుక? ఈ గడ్డమీదే పుట్టిన మహానుభావుడనే పేరిట మహావీరుణ్ణీ కలుపుకుని జైనులను అక్కున చేర్చుకుంటున్నాడు. మల్లియ రేచన, అమర సింహుడు లాంటి జైనులకు ఈ గడ్డపై జరిగిన అన్యాయం నోట్లకట్టలు లెక్కపెట్టుకునే పనిలో మునిగితేలే ఈ కాలపు జైనూక్ లకు ఏమెరుక?  ఇక, ఇస్లామ్ మీద వైరం కారణంగానే ఇరాన్ వదిలి వచ్చేసిన పారసీల సెంటిమెంటును దోచుకుంటున్నారు. ముస్లిములతో పవిత్ర యుద్ధాలు చేసిన క్రైస్తవులనూ కావలించుకుంటున్నాడు. అన్నిటికీ మించి “ట్రిపుల్ తలాక్”, యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటి చిట్కాలతో ముస్లిమ్స్ లోని కొన్ని వర్గాలను ఆకట్టుకుంటున్నాడు. కౌటిల్యుడు కండచీమల్నివాడుకున్నట్లు ఈ వర్గాలవారిని వాడుకోవాలన్నది క్యాబ్ కౌటిల్యుడి పథకం.
అనగా, పైకి కూడికలూ తీసివేతలుగా కనపడినప్పటికీ- నిజానికి క్యాబ్ విధానం తీసివేతలూ మరియూ తీసివేస్తాలూ మాత్రమే!!
ఇదే చిట్కా తర్వాత్తర్వాత కులాల మధ్యన కూడా అమలు చేస్తారు మన కులాకౌటిల్యులు!
– మందలపర్తి కిషోర్