(న్యూస్ అర్బిట్ బ్యూరో)
అమరావతి: ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి అత్యుత్సాహం వికటించింది. తన టిక్‌టాక్ వీడియోకు బ్రహ్మాండమైన స్పందన వస్తుందని భావించి ఆమె ఆ వీడియో చేసిఉంటారు. అయితే రివర్స్ స్పందన కూడా ఉంటుందని ఆమె ఊహించినట్లు లేదు. a
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో వచ్చిన హిట్ సాంగ్ రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న పాటకు పుష్ప శ్రీవాణి టిక్‌టాక్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియోలో షేర్ చేశారు. సిఎం జగన్ దగ్గర పాయింట్లు కొట్టేయడానికి చేసిన టిక్‌టాక్ హుషారుగా బాగానే ఉంది. జనం స్పందన కూడా బాగానే ఉంది. అయితే రాజకీయ ప్రత్యర్ధులు మరో రకంగా స్పందించారు.
రాజధాని తరలింపు ప్రతిపాదనను నిరసిస్తూ ఉద్యమం బాట పట్టిన రైతులకు టిడిపి అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురువారం తన గాజులు విరాళంగా ఇచ్చారు. దానిని పుష్ప శ్రీవాణి విమర్శించారు. అందుకు టిడిపి నేతలు స్పందిస్తూ, టిక్‌టాక్ చేసుకునే మంత్రులు భువనేశ్వరిని విమర్శించడం ఏమిటని ఎద్దేవా చేశారు. టిడిపి అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ, మాజీ మంత్రి జవహర్ ఈ టిక్‌టాక్‌ను అడ్డం పెట్టుకుని ఉప ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా టిక్‌టాక్ మంత్రులు అంటూ విమర్శలకు పదును పెట్టారు. పుష్ప శ్రీవాణి టిక్‌టాక్ ఆ విధంగా ప్రత్యర్ధులకు మరో అస్త్రం అందించింది.