NewsOrbit
టాప్ స్టోరీస్

సమాజ వైఫల్యం ‘దిశ’గానే..!

 

‘దిశ’ హత్యాచారం నిందితుల ఎన్‌కౌంటర్ వార్తకు దేశం యావత్తూ నిద్ర లేచింది. దిశ విషయంలో జరిగిన అమానుషం ఎంత సంచలనం సృష్టించిందో ఈ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ కూడా అంతే సంచలనం సృష్టించింది. దిశ కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ‘మా అమ్మాయికి ఆత్మశాంతి, మాకు కొద్దిగా ఊరట దొరికాయి’ అని దిశ తల్లి వ్యాఖ్యానించింది.

నిజానికి ‘ఇంటి లక్ష్మి’ని కోల్పోయిన దిశ కుటుంబసభ్యుల స్పందనే ఈ విషయంలో అందరికన్నా కాస్త సంయమనంతో ఉంది. దిశకు ఏమీ కాని వారి స్పందన మాత్రం పండగ చేసుకున్నట్లుంది. ఎన్‌కౌంటర్ జరిగిన చోట పోలీసులపై ప్రజలు పూలు చల్లారు. వారికి స్వీట్లు తినిపించారు. తెలంగాణ పోలీసులపై ప్రశంసలతో సోషల్ మీడియా బరువెక్కిపోతున్నది.

రాజకీయ నాయకులు, సినిమా నటులు, స్వామీజీలు, ఇతర సెలబ్రిటీలు అందరూ కూడా ఎన్‌కౌంటర్‌ను సంబరంగా స్వాగతిస్తున్నారు. ఢిల్లీ నిర్భయ తల్లి, ‘హైదరాబాద్‌లో ప్రతీకారం దొరికింది’ అన్నది (ఆమె కుమార్తె హంతకులకు  ఇంకా ఉరిశిక్ష అమలు జరగలేదు). మజ్లిస్ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ తప్ప రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ ఎన్‌కౌంటర్‌ పట్ల హర్షం వ్యక్తం చేయని రాజకీయ నాయకులు లేరు. ఎన్‌కౌంటర్‌ను స్వాగతించేందుకు ప్రతి ఒక్కరూ పోటీ పడుతున్నారనడం కరెక్టేమో! ఈ స్పందన తెలంగాణ ఎల్లలు దాటింది కూడా. ఉత్తరప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలని ఆ రాష్ట్రాన్ని గతంలో పాలించిన బహుజన్ సమాజ్ పార్టీ నాయకురాలు మాయావతి వ్యాఖ్యానించారు. ఆఖరికి పార్లమెంట్‌లో కూడా ఎన్‌కౌంటర్‌ను ప్రశ్నించినవారు లేకపోయారు.

ఇంతకీ ఈ ఎన్‌కౌంటర్ ఎలా జరిగింది? దిశపై పెట్రోల్ పోసి నిప్పంటించిన చటాన్‌పల్లి వంతెన కింద క్రయిం సీనును నిందితుల సమక్షంలో కళ్లకు కట్టేందుకు తెల్లవారుఝామున పోలీసులు ఆ నలుగురినీ అక్కడకు తీసుకువెళ్లారు. అక్కడ అకస్మాత్తుగా నిందితులలో ఒకరు మిగతావారికి సైగ చేశాడు. వెంటనే నిందితులు పోలీసులపై రాళ్లు విసురుతూ పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసుల దగ్గరున్న ఆయుధాలను లాక్కునేందుకు కూడా ప్రయత్నించారు. తప్పనిసరి  పరిస్థితులలో పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురూ మరణించారు.

ఇది పోలీసుల కథనం. నిజంగా ఏం జరిగిందో ప్రజల చెబుతున్నారు. తెలంగాణ పోలీసులను మరీ ముఖ్యంగా సైబరాబాద్ పోలీసు కమిషనర్  విశ్వనాధ్ చెన్నప్ప సజ్జన్నార్‌పై పొగడ్తల వర్షం కురిపించడం ద్వారా ప్రజలు అసలేం జరిగిందో చెప్పకనే చెబుతున్నారు. ఆ మాటకొస్తే రాజకీయనాయకులు, సినిమా హీరోహీరోయిన్లు, స్వామీజీల స్పందన కూడా అసలేం జరిగిందో సూచించేదే. పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న నిందితులను కాల్చి చంపితే పోలీసులు హీరోలు ఎలా అయ్యారు?

తక్షణం కాకపోయినా కాస్త లేటుగా అయినా ఈ ఎన్‌కౌంటర్ మంచిచెడ్డలు చర్చకు వస్తాయి. దీనిపై పౌరసమాజం దృష్టి సారిస్తుంది. ఫలితం ఏమన్నా ఉంటుందా అన్నది వేరే సంగతి. 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వరంగల్ జిల్లాలో ఇద్దరు యువతులపై యాసిడ్ దాడి కేసులోని ముగ్గురు నిందితుల ఎన్‌కౌంటర్ కూడా సజ్జన్నార్ ఆధ్వర్యంలోనే జరిగింది. అప్పుడు ఏమీ కాలేదు. ఇప్పుడు ఏమన్నా అవుతుందన్న నమ్మకం లేదు. ఏ ఎన్‌కౌంటర్ జరిగినా అందులో పాలు పంచుకున్న పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యాలనీ, సంఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరగాలనీ, విడిగా మెజిస్టీరియల్ విచారణ జరగాలనీ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు నిర్దేశిస్తున్నాయి. ఈ మార్గదర్శకాలు 2016 నుంచీ అమలులో ఉన్నాయి. అప్పటి నుంచీ దేశంలో చాలా ఎన్‌కౌంటర్లు జరిగాయి. పోలీసులు కాల్చిచంపి ఎన్‌కౌంటర్ అంటున్నారన్న ఆరోపణలు చాలా సందర్భాలలో వినవచ్చాయి. ఒక్క సందర్భంలో కూడా అవి నిరూపణ కాలేదు. కాబట్టి పోలీసులు నిజంగా పులు కడిగిన ముత్యాలు అనుకుందామా?

దేశ రాజధానిలో 2012లో జరిగిన నిర్భయ ఉదంతం తర్వాత హైదరాబాద్‌లో చోటు చేసుకున్న దిశ సంఘటనే దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ మధ్యలో దేశంలో మహిళల మానభంగాలు, హత్యలు జరగలేదా? చాలా జరిగాయి. మరి వాటిపై ఇంత స్పందన ఎందుకు లేదు? వారు కూడా అందరి లాంటి ఆడవారే కదా?

ఈ ప్రశ్నలకు 24 గంటల న్యూస్ ఛానళ్ల ఎడిటర్లు సరైన సమాధానాలు చెప్పగలరు. ఏ అమానుషం ‘అమ్ముడు’ పోతుందో వారికి బాగా తెలుసు కాబట్టి ఈ ప్రశ్నలకు కూడా వారే జవాబు ఇవ్వగలరు. ఇక సోషల్ మీడియాకు వస్తే అందరూ ఎడిటర్లే. ఏ అంశాల ఆధారంగా న్యూస్ ఛానళ్ల ఎడిటర్లు క్రయిం వార్త ప్రాధాన్యత నిర్ణయిస్తారో సోషల్ మీడియాకు కూడా అవే ప్రాధాన్యతలు వర్తిస్తాయి. ఒక సంఘటనపై సోషల్ మీడియాలో స్పందన ఒకసారి ఒక కీలక దశ(క్రిటికల్ త్రెషోల్డ్)కు చేరుకున్నాక ఇక కట్టలు తెగుతాయి.

ఒక మహిళపై దారుణంగా ఆత్యాచారం చేసి ఆపై ఆమెను హతమారిస్తే ఇంత కసాయితనంగా కూడికలు, భాగాహారాలు వేస్తారా అని ఎవరికైనా కోపం రావచ్చు. నిర్భయ అయనా, దిశ అయినా, ఇంకో మహిళ ఎవరయినా మానభంగాలు మాటలకు అందనంత ఘోరమైన నేరాలు, నిజమే. అయితే వాటిలో కొన్ని మాత్రమే మధ్యతరగతి హృదయాలను తాకుతాయి. తాము, తమ కుటుంబసభ్యుల భద్రతకు పూచీ ఎవరని వ్యవస్థను నిలదీసేందుకు పురికొల్పుతాయి. ఎలక్ట్రానిక్ మీడియా అయినా, సోషల్ మీడియా అయినా ఆ మధ్యతరగతిలో భాగమే. మధ్యతరగతి లేకపోతే మీడియా లేదు.

నిర్భయ ఉదంతంపై వచ్చిన స్పందనకు, దిశ సంఘటనపై వచ్చిన స్పందనకూ మధ్య ఒక తేడా ఉంది. నిర్భయ విషయంలో న్యాయం కావాలని జనం నినదించారు. దిశ విషయంలో ఎలాంటి న్యాయం కావాలో డిమాండ్ చేశారు. బహిరంగంగా ఉరి తీయాలని చాలామంది రాజకీయనాయకులు, ఇతర సెలబ్రిటీలు డిమాండ్ చేశారు. ప్రముఖ నటి జయా బచ్చన్ ఏకంగా,  నిందితులపై బహిరంగంగా మూకదాడి చేసి కొట్టి చంపాలని (లించింగ్) అన్నారు. అది కూడా ఎక్కడ? పెద్దల సభ అయిన రాజ్యసభలో!షాద్‌నగర్ పోలీసు స్టేషన్ బయటచేరి నిందితులను తమకు అప్పగించాలని పట్టుబట్టిన మధ్యతరగతి స్పందన చూసి పదిమందికి ఆదర్శంగా నిలవాల్సిన వారు కూడా ఆ దారినే నడవాలని నిర్ణయించుకున్నారు.

దిశ సంఘటన, దానికి ప్రజల స్పందన తెలంగాణ పోలీసులపై తీవ్రమైన వత్తిడి తెచ్చింది. వరంగల్ యాసిడ్ దాడి నిందితుల ఎన్‌కౌంటర్‌ను ప్రస్తావిస్తూ, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని హీరోగా పొగుడుతూ రూపొందించిన ఒక పోస్టు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టింది. అదే సమయంలో దిశ కుటుంబాన్ని పరామర్శించకుండా ముఖ్యమంత్రి కెసిఆర్ పెళ్లిళ్లకు తిరుగుతున్నారన్న విమర్శ  కూడా వైరల్ అయింది.

నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలని పోలీసు అధికారులు, ఆ అధికారుల కన్నా పైనుండే పెద్దలు నిర్ణయించడానికి ఈ వత్తిడి కన్నా పెద్ద కారణం ఏం కావాలి? ఇక్కడ మనం పట్టించుకోని విషయం ఇంకోటి ఉంది. ఆ నలుగురూ నేరం చేశారన్న దానికి పోలీసులు చెప్పిన మాటే తప్ప మరో నిదర్శనం లేదు. పోలీసులు సేకరించి సమకూర్చుకునే సాక్ష్యాలు చూసి వారు నేరం చేశారా లేదా అని కోర్టు నిర్ధారిస్తుంది. దిశ కేసులో ఇక ఆ అవకాశం లేదు. ఆ నలుగురూ నేరం చేయకపోయిఉంటే దిశపై దారుణంగా దాడి చేసిన వారు సమాజంలో మన మధ్యనే నిక్షేపంలా తిరుగుతున్నారు, ఇంకా తిరుగుతారు.

దిశ హంతకులు నిజంగా ఆ నలుగురే అయిఉండొచ్చు. అయినా గానీ  ఏ ఎన్‌కౌంటర్ అయినా ఈ సందిగ్ధతకు అవకాశం ఇస్తుంది. ఈ సందిగ్ధతను మనం తప్పక ప్రశ్నించాలి. మన సమాజంలో ఇలాంటి నేరాలు ఎందుకు ఎక్కువవుతున్నాయి అన్న ప్రశ్న జోలికి, వ్యవస్థలో లోపాల జోలికి, తీసుకోవాల్సిన చర్యల జోలికి నేను వెళ్లడం లేదు. ఎందుకంటే వాటి గురించి చాలామంది చాలా రాశారు. ఈ ఎన్‌కౌంటర్ దరిమిలా ఇంకా  రాస్తారు. వేడి తగ్గిన తర్వాత జనం కూడా ఆలోచిస్తారు. ఒక ఘోరం జరిగితే దానికి ప్రతిగా రాజ్యం నలుగురు యువకులను – వారు ఎలాంటి వారైనా అవుగాక – చీకటి మాటున కాల్చిచంపి సమాజానికి బహుమతిగా ఇవ్వడం ఏ విలువలను ప్రతిపాదిస్తున్నదన్న ప్రశ్నకు నేను ఇక్కడ పరిమితమవ్వదలచుకున్నాను. ఆ తక్షణ న్యాయం బహుమతికి సంతోషం పట్టలేక మిఠాయిలు పంచుకుని, వీధుల్లో  డాన్స్ చేస్తున్న జనాన్ని చూస్తే భయం వేయడం లేదూ? ఒక సమాజంగా మనం విఫలమయ్యామని అనిపించడం లేదూ?

 

ఆలపాటి సురేశ్ కుమార్

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment