(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వాడి వేడి చర్చ జరుగుతున్నది. ఎక్కడ వివాదాలు ఉంటాయో అక్కడ సంచలన దర్శకుడు వర్మ ఉంటాడు. ఏ అంశంపై అయినా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పే దర్శకుడు వర్మ ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో జరిగిన ‘బ్యూటిఫుల్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ప్రచార కార్యక్రమంలో వర్మతో పాటు చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ సందర్భంగా వర్మ ఏపీ రాజధానిపై స్పందించారు. సీఎం జగన్ రాజధాని గేమ్ ఆడుతున్నారని అన్నారు. తన దృష్టిలో రాజధాని అనే పదానికి అర్ధమే లేదని చెప్పారు. రాజకీయాలతో సంబంధం లేని సామాన్యులకు రాజధానితో పని ఏముంటుందని, అలాంటప్పుడు రాజధాని ఎక్కడ ఉన్నా ఒక్కటే అని అన్నారు. రాజధానిని పక్క రాష్ట్రంలో పెట్టినా పట్టించుకోనని అన్నారు. రాజధాని అనకాపల్లిలో ఉంటే ఏంటి? చెన్నైలో ఉంటే ఏంటి? అంటూ తనదైన శైలిలో వర్మ వ్యాఖ్యానించారు. రాజధాని అంటే మెయిన్ థియేటర్ లాంటిది అని చెప్పిన వర్మ.. ప్రజలకు నేరుగా పాలన అందాలంటే ప్రతి పట్టణానికి ఒక రాజధాని ఉండాలని అభిప్రాయపడ్డారు.