NewsOrbit
వ్యాఖ్య

ఒక పనైపోయిందా..?

హమ్మయ్య ఒక పనైపోయింది కదా! కూతుళ్ళున్న ప్రతి తల్లిదండ్రుల కన్న పేగుల్ని కాల్చేసిన ఆ ఘటనకు బాధ్యులైన ఆ నలుగురినీ కాల్చేశారు కదా! ఆందోళనకు దిగిన యావత్తు ప్రజానీకం  ఇక ఊపిరి పీల్చుకుంటుందా? అందరికీ ఊరట దొరికినట్టేనా? యాక్షన్..రియాక్షన్ అండ్ ఇమీడియెట్ యాక్షన్ అంతా సినిమాలా జరిగిపోయింది కదా! అటు బాధితురాలి తల్లిదండ్రులు..ఇటు సమస్త జనావళి పోలీసులపై ప్రశంసల పూలు జల్లుతున్నారు కదా! ఘోరం జరిగినప్పుడు విమర్శల రాళ్ళు విసిరారు కదా! పోనీలెండి. ఇక అంతా శాంతిస్తే అంతే చాలు. సీన్ రీకనస్ట్రక్షన్ అంటే ఇదేనేమో!

సో, ఇక ఎవరికి వాళ్ళు కళ్ళు తుడుచుకుని గుండెలు నిబ్బరించుకుని..జబ్బలు చరుచుకుంటూ ఇంటికిపోయి పడుకోవచ్చా? లేక ఏమైనా మిగిలిందా? కాలిపోయిన బిడ్డ ఎలాగూ మాయమైపోయింది. కన్న వాళ్ళు మాకు న్యాయం జరిగిందంటున్నారు. మిగిలిన వాళ్ళు సెభాష్ పోలీస్ అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. కాబట్టి ఒక ఎన్‌కౌంటర్‌తో అన్నీ సర్దుకుపోతాయని మనం అనుకోవచ్చా? రోడ్డెక్కి దిశకు న్యాయం జరగాలని నిరసన సముద్రాలైన ఆడపిల్లలు..వారి తల్లిదండ్రులు..వారి సోదరులు అందరూ ఇక నిర్భయంగా రోజులు సాగించవచ్చా? మరోసారి ఇలాంటి ఘటనలు రిపీట్ కావని పూర్తి నమ్మకంతో స్వేచ్ఛగా మన ఆడపిల్లలు సంచరించగలరని మనం భావించవచ్చా? నాకు తెలిసి..రోడ్డెక్కినవాళ్ళు..జస్టిస్ జస్టిస్ అరిచిన వాళ్ళు బాధితురాలికి న్యాయం కోసమే కాదు, తమ జీవితాలకూ భద్రత కావాలన్న ఆందోళనతోనే అలా విరుచుకుపడ్డారు. మరి వారి ఆందోళనకు భరోసా ఈ ఎన్‌కౌంటర్ ఇవ్వగలదా?

నేరమూ జరిగింది..శిక్షా అమలైపోయింది.  పిచ్చి జనం రోజువారీ జీవితం రొదలో పడి అన్నీ మర్చిపోతారు. మళ్ళీ అతి త్వరలోనో..కొంచెం దూరంలోనో మరో నేరం అంతకు ముందు కంటే దారుణంగా జరగదన్న గ్యారెంటీ వుందా?

నేనేమంటున్నానంటే ఇలాంటి ఘటనలు మనకు చేసే కొన్ని హెచ్చరికలు ఉంటాయి. వాటిని విందాం. శిక్షలు..చట్టాలు..న్యాయాలు..ఎంత అవసరమో ఈ హెచ్చరికల పట్ల మన ఎరుక కూడా వంద రెట్లు ఎక్కువ అవసరం అని నా మనవి. దోషులు పుడుతూనే వుంటారు. వారిని పుట్టించే దోషులు ఎవరికీ కనిపించరు. ఏ చట్టానికీ చిక్కరు. వారికి ఏ శిక్షలూ పడవు. ఎందుకంటే దోషుల్ని పుట్టించేది వారే. తిరిగి వారిని పట్టించేది వారే..చట్టాలు చేసేది వారే.. శిక్షలు అమలుపరచేది వారే. కనీసం ఇలాంటి ఘటనలు జరిగినప్పుడైనా తీరుబడిగా మూలాల అన్వేషణ జరగాలి కదా?

క్లీనర్లు..మెకానిక్కులు..ప్లంబర్లు..ఆటోలు..ట్రక్కులు నడిపే వారు…పబ్బుల్లో..బారుల్లో సర్వర్లు.. ఎక్కువగా ఇలాంటి వారే అతి హేయమైన ఈ పనులకు పాల్పడుతున్నారని ఒక వాదన వుంది. అందులో నిజాన్ని కొట్టిపారేయలేం. చదువు లేదు..సంధ్య లేదు..బతకడానికి మెతుకు లేదు..కట్టడానికి బట్ట లేదు..పైన గూడు లేదు..కింద తోడు లేదు..అలాంటి కోట్లాది స్త్రీలు కని ఏ మురికి వాడలోకో విసిరేసిన పిల్లలు ఎందరో.  వేలు..లక్షలు..కోట్లలో విచ్చలవిడిగా బాధ్యతారాహిత్యంతో మావనత్వం,  మృగత్వాలకు తేడా తెలియని ఆటవిక సంచారులున్న దేశం మనది. వాళ్ళను సంస్కరించే నిజాయితీ..నిబద్ధత..ప్రణాళికలు మనకున్నాయా? ఇంకా ఇంకా పెరిగిపోతున్న పేదరికం.. నిరక్షరాస్యత.. నిరుద్యోగం.. ఒక పక్క, పర్వతాల్లా పెరిగిపోతున్న పాలకుల  అవినీతి ఆస్తులు మరో పక్క. ఈ వికృత అసమసమాజ పాప పరిణామాలు ఏ రూపంలో వుంటాయి?  ఈ ప్రశ్నకు సమాధానం చెప్పమంటే ఏడు దశాబ్దాల స్వాతంత్ర్యం సిగ్గుతో తలదించుకుంటుంది. ఈ అనాగరిక నేపథ్యం నుంచి వచ్చిన  వాళ్ళు ఎంత సునాయాసంగా నేరాలు చేస్తారో అంతే సహజంగా చట్టానికి చిక్కిపోతారు కూడా.

దోషుల పట్ల నాకు ఎలాంటి సానుభూతీ లేదు. వాళ్ళను వీలైనంత కఠినంగా, వేగంగా శిక్షించమనే అంటున్నాను. వాళ్ళను రక్షించడానికి, వాళ్ల తరపున వకాల్తా పుచ్చుకుని వాదించడానికి పై కోర్టులకు వెళ్ళడానికి ఎవరూ ముందుకు రారు కాబట్టి మీనమేషాలు లెక్కించాల్సిన అవసరమే లేదు. ఎన్‌కౌంటర్లు చేసుకుంటూ పోవచ్చు. అది మనకు కొత్తేం కాదుగా.  దోషులను తయారు చేస్తున్న దోషపూరిత సమాజాన్ని చదవమంటున్నాను. స్త్రీని పురుషుడి  లైంగిక మోహార్తిని తీర్చే సాధనంగా మాత్రమే చూపించే సవాలక్ష వెబ్‌సైట్లు..సినిమాలు..వీడియోలు..ఛానల్సు నిరంతరం అరచేతిలోనే వుంటాయి.  వాటిని అందరికీ అందుబాటులోకి తెచ్చేది  మురికివాడల మురికి మనుషులు కాదు. వాటిని వినియోగించేది..మన వినియోగంలోకి  తెచ్చేది సంస్కారవంతుల సమాజమే.  అధికారిక నేర రికార్డుల ప్రకారం రోజూ దేశంలో ఏదో ఒక మూలనుండి ఎందరో ఆడపిల్లలు మాయమైపోతున్నారు. వాళ్ళని కొన్ని గంటల్లోనే సరిహద్దులు దాటిస్తున్నది క్లీనర్లూ కాదు..డ్రైవర్లూ కాదు. వెనకనున్న ఘరానా దొంగలెవరో మనకు తెలుసు. ఆయేషా మీరాల్లాంటి వేలాది బలహీన పడతుల హాహాకారాలు గుండెల్ని మెలితిప్పుతూనే వున్నాయి. ఆ నిందితులు ఎందుకు దొరకలేదు? వారికెందుకు ఎన్‌కౌంటర్లు జరగలేదు? వాకపల్లి అడవి బిడ్డల సామూహిక అత్యాచారాలు ఏ చట్టం సాక్ష్యంగా జరిగాయి? కాశ్మీర్ లోనో..ఈశాన్య భారతంలోనో రోజుకెందరు అసహాయ వనితలు హత్యాచారాలకు గురవ్వడం లేదు? అక్కడ ఎన్‌కౌంటర్లు కాదుకదా, యూనిఫారాల్లో ఉన్న ఆ నేరస్తుల మీద కనీనం కేసులు పెట్టడానికి కూడా  ఏ చట్టాలు అడ్డుపడుతున్నాయి? ఎనిమిదేళ్ళ  ఆసిఫా మీద క్రూరంగా దాడిచేసిన వారికి ఏ శిక్షలు అమలు జరిగాయి? ఎప్పుడూ కొందరే ఎందుకు పట్టుబడతారు? ఎందరో ఎందుకు తప్పించుకుంటారు? ఒకటి రెండు మూడు నాలుగు ఘటనల్లో  లంపెన్ గ్యాంగు ఎలాగూ దొరికిపోతారు. మరి వేలాది ఘోరకిరాతక ఘటనల్లో తప్పించుకు తిరుగుతున్న బడాబాబులను ఎప్పుడు ఎవరు ఎలా ఎన్‌కౌంటర్లు చేయగలరు? అసలు వీరిని రక్షించడానికే లంపెన్ వ్యవస్థను కూడా సమాంతరంగా పెంచి పోషిస్తూ అప్పుడప్పుడూ ఒకరిద్దరిని ఉరితీయడమో నరికేయడమో కాల్చేయడమో చేస్తున్నారా? తద్వారా నా అమాయక దేశానికి అహం శాంతిస్తుందా? మూలాల్లోకి పోతే ఇలాంటి సందేహాలు మన హృదయాలను ఎన్‌కౌంటర్ చేస్తాయి. నేరస్తుల పట్ల ఎలాంటి జాలినీ ప్రదర్శించమనడం లేదు. ఎక్కడ ఏ ఆడకూతురు ఏ అకృత్యానికి గురైనా నా కూతురికే ఏదో జరిగినట్టు తల్లడిల్లిపోయే కవిని నేను. ఒక నేరం జరిగితే అందులో నా భాగం  ఏమిటా అని లెక్కలు వేసుకునే నాగరికుల సమాజం కావాలి. కనీసం ఇలాంటి ఘటనలు జరిగినప్పుడైనా నేరం వెనక మహానేరాన్ని..దోషుల వెనక మహాదోషుల్ని పోల్చుకోవాలంటున్నాను. తక్షణ శిక్షలు ఎంత అవసరమో..కొన్ని నేరాల నిర్మూలనకు సుదీర్ఘ అన్వేషణలూ అంతే అవసరం. నేరస్తులే నేరాలను నిర్మూలించలేరు. సత్యాన్ని నిజాయితీగా గ్రహించినప్పుడే సుందరమైన సమాజాన్ని నిర్మించుకోగలం.

డా.ప్రసాదమూర్తి

Related posts

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Saranya Koduri

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Allu Arjun: బన్నీ కి భారీ షాక్ ఇచ్చిన శ్రీ లీల… ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Venkatesh: వెంకీ మామా ఏంటి నీకు ఈ ఘోర అవ‌మానం… ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌..!

Saranya Koduri

Charmi: ” నీ హగ్గులు, లవ్ చాలా మిస్ అవుతున్నా.. తిరిగి మళ్లీ నా లైఫ్ లోకి రా “.. చార్మి సెన్సేషనల్ పోస్ట్..!

Saranya Koduri

Chiranjeevi: చిరు ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సీఎం కి కూడా ఈ రేంజ్ ఉండదేమో..!

Saranya Koduri

Balakrishna: బాల‌య్య ప‌క్క‌న ఆ హీరోయిన్… ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్రా బాబు..!

Saranya Koduri

Junior NTR: నందమూరి ఫ్యామిలీ తారక్ ని అందుకే దూరం పెడుతుందా.. బయటపడ్డ అసలు నిజం..!

Saranya Koduri

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Saranya Koduri

Samantha: జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను అంటూ మరోసారి తన ఆవేదనను బయటపెట్టిన సమంత..!

Saranya Koduri

నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ

Deepak Rajula

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment