అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ముళ్ల కంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి లోకేష్ బయటకు వస్తే అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. చంద్రబాబు నివాసం నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.
మరోవైపు తిరుపతిలో టీడీపీ అధినేత చంద్రబాబు తలపెట్టిన అమరావతి పరిరక్షణ సమితి ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. పండుగ సీజన్ కావడంతో ర్యాలీకి అనుమతి నిరాకరించినట్లు అర్బన్ ఎస్పీ తెలిపారు. తిరుపతిలో టీడీపీ సీనియర్ నేతలు, కార్యకర్తల ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.