మతము..మానవత్వము…దేశము!

మహాత్మా గాంధీ 150వ జయంతిని దేశమంతా ఘనంగా జరుపుతున్న ఏలికలు గాంధీని ఒక విగ్రహంగా తప్ప ఆయన సందేశాలను గాని, ఆయన ఉపదేశాలను గానీ పట్టించుకునేలా  కనిపించడం లేదు. గాంధీ తన హింద్ స్వరాజ్ పుస్తకంలో భారత దేశం అనేక జాతుల సమ్మేళనం అనీ, ఎవరు ఇక్కడకు వచ్చినా అందులో భాగంగా కలిసిపోతారనీ స్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాదు, హిందువులందరూ కలిసి ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చాలని అనుకుంటే అది వారి కలే గాని అదెప్పటికీ నిజం కాదని నొక్కి చెప్పారు. గాంధీ పట్ల ఏమాత్రమైనా గౌరవం భక్తి ఉన్నా దేశాన్ని మతరాజ్యంగా మార్చాలనుకుంటున్న కాషాయ నేతలు కాస్తంత ఆలోచించే వారు. గాంధీ బొమ్మ తప్ప గాంధీ సందేశాలు మనకు అనవసరం అని ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన పౌరసత్వ చట్టం తేల్చి చెప్పేసింది. అంబేద్కర్ జయంతులూ వర్థంతులూ దేశమంతా ఘనంగా చేస్తున్న పాలకులకు ఆయన పేరు తప్ప ఆయన ఆశయాలు..దేశం పట్ల ఆయన ఆలోచనలు ఏమాత్రం అవసరం లేదని కూడా ఈ కొత్త చట్టం ద్వారా తేలిపోయింది. దేశాన్ని కులాతీత మతాతీత లౌకిక రాజ్యంగా నిర్మించాలని బాబాసాహెబ్ కలగన్నారు. ఆ కలను కూడా మన నేతలు ఆచరణలో ధ్వంసం చేస్తున్నట్లు ఈ కొత్త చట్టం ద్వారా అర్థమవుతోంది. దేశంలో ప్రజాస్వామికవాదులు, మేధావులు, మానవతాప్రేమికులు, కవులు, కళాకారులు..ఆఖరికి విద్యార్థులు కూడా ఆందోళన చెందుతున్నారు. మడమ తిప్పేది లేదంటున్నారు హోం మంత్రి అమిత్ షా. దేశవ్యాప్తంగా ఇక ఎన్నార్సీ అమల్లోకి రాబోతుందని బోర విరుచుకుని మరీ చెప్తున్నారు. సాటి మనుషులను మతం ప్రాతిపదికన గాక, మానవత్వమే  ప్రాతిపదికగా ప్రేమించి గౌరవించే సగటు భారతీయులందరూ కలవరపడుతున్నారు. దేశాన్ని  ఏ అంధయుగాలవైపు మన  నాయకులు నడిపించబోతున్నారా అని ఆవేదన చెందుతున్నారు.

మనుషులు మాట్లాడుకోవడానికి..మనుషులు కలలు కలబోసుకోడానికి..మనుషులు సమూహాలుగా సహజీవనం సాగించడానికి ఇక మతమే ప్రాతిపదిక కాబోతుందని ఈ పరిణామాలు స్పష్టం  చేస్తున్నాయి. కేవలం ఒక మతాన్నిలక్ష్యం చేసుకుని మన పాలకులు పాచికలు కదుపుతున్నారు. ముందు వారి ఆహారపు అలవాట్ల మీద దాడి చేశారు. తర్వాత వారి మతపరమైన హక్కుల మీద దాడి చేశారు. ఇప్పుడు వారి పౌరసత్వం మీద దాడి మొదలు పెట్టారు. హిందువులు..క్రిస్టియన్లు..ఫారసీలు..జైనులు..బౌద్ధులు ఇలా ఎవరైనా పర్వాలేదు కాని ఇక్కడ ముస్లింలు మాత్రం వారి దారి వారు వెదుక్కోవడం  మంచిదని మన పాలకులు పరోక్షంగా సూచిస్తున్నారు. తమ మతం  మెజారిటీగా ఉన్న పొరుగు దేశాలకు వారు పారిపోయి అక్కడ శరణు తీసుకోవడం మంచిదని సలహాలిస్తున్నారు. నిర్భయంగా ,నిస్సిగ్గుగా, అత్యంత క్రూరంగా రాజ్యాంగంలోని మౌలికమైన హక్కుల్ని తగలబెడుతున్నారు.  రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 ప్రసాదించిన హక్కుల్ని నిర్దాక్షిణ్యంగా కాలరాస్తున్నారు.

ఇక మనం మతం కళ్ళతోనే అన్నీ చూడాలి.మతం గొంతులోనే అంతా పలకాలి. మతం చెవులతోనే అన్నీ వినాలి. మతం గుండెతోనే అన్నింటికీ స్పందించాలి. నేను ఎప్పుడో ఎన్నార్సీ వ్యవహారాన్ని పసిగట్టి దేశం లేని ప్రజలు అనే కవిత రాశాను. ఆ పేరుతోనే గత సంవత్సరం ఒక కవితా సంకలనాన్ని తెచ్చాను. ఇప్పుడా కవిత గర్తు చేసుకుంటున్నాను. మీ కోసం కొన్ని పంక్తులు ఇక్కడిస్తున్నాను

దేశం లేని ప్రజలు

అదనపు జనం ..అఖ్ఖర్లేని జనం..మిగులు జనం..తమకంటూ ఎవరూ మిగలని జనం

ఇప్పుడు నా అక్షరాలను పట్టుకుని వేళ్ళాడుతున్న జనం

 జనం గురించి మాట్లాడాలనే మనసు తహతహలాడుతోంది

దేశంలో ఉంటూ దేశం లేని జనం గురించి జనంలో వుంటూ జనాభా లెక్కల్లో లేని జనం గురించి

ఏం మాట్లాడాలి? ఏమైనా మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? ఏలాగైనా మాట్లాడాలి.

గుండెలు చీల్చి దేశ పటాన్ని చూపించినా కాదు పొమ్మంటున్న దేశం ముందు మోకరిల్లిన

శిలల శిలల అశ్రు బిందువుల అల్లకల్లోల దృశ్యాల గురించి మాట్లాడాలి 

పేదరికం గురించి కాదు పేదవాళ్ళ మతమేదో దర్యాప్తు చేయాలి

అస్సాంలో వలవేయాలి బెంగాల్లో చేపలు పట్టాలి త్రిపురలో లెక్కలు తీయాలి

శ్రీలంక కావొచ్చు..సిరియా కావొచ్చు దేహాలను దేశాల కవతల గుడారాలుగా పాతుకుంటున్న కాందిశీకుల కళ్ళల్లో కత్తులు పూస్తున్న కాలం గురించి మాట్లాడాలి

 కేవలం బాధపడడమే కాదు, అందరూ ఇక కార్యాచరణలోకి దూకే కాలం వచ్చిందేమో.

లేకుంటే లాభం లేదని జరుగుతున్న నాటకం హెచ్చరిస్తోంది.

డా.ప్రసాదమూర్తి