తెలంగాణ కాంగ్రెస్‌లో మరో లొల్లి!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు బయటకొచ్చాయి. గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ నేతల సమావేశం రసాభాసగా మారింది. పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహించేందుకు వచ్చిన పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ముందే కాంగ్రెస్ సీనియర్ నేతలు వి.హనుంతరావు, షబ్బీర్ అలీ మధ్య వాడీవేడీగా వాగ్వాదం జరిగింది. ఈ ఇద్దరు నేతలు తీవ్ర పదజాలంతో పరస్పరం దూషించుకున్నారు. కాంగ్రెస్‌లో సీనియర్‌ లీడర్లకు అన్యాయం జరుగుతోందని, ఆర్‌ఎస్‌ఎస్‌ సానుభూతిపరులకు పెద్దపీట వేస్తున్నారని ఆరోపిస్తూ పరోక్షంగా షబ్బీర్ తీరును వీహెచ్ తప్పుబట్టారు. కాంగ్రెస్ సీనియర్ నేతలను శవాలంటే ఊరుకునేది లేదని వీహెచ్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో వీహెచ్ గురించి మాట్లాడాల్సిన అవసరం తనకులేదని షబ్బీర్ అలీ తెలిపారు. ఇద్దరి మధ్య వివాదం పెద్దగా మారుతున్నట్టు గమనించిన ఆజాద్ ఇద్దరికీ సర్ధిచెప్పారు. సమావేశం మధ్యలోనే వీహెచ్ బయటికి వెళ్లిపోయారు.

కొంతకాలం నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా రేవంత్ రెడ్డిని ఎక్కువగా టార్గెట్ చేస్తున్న వీహెచ్… తాజాగా ఆయనకు కాంగ్రెస్‌లో మద్దతు ఇస్తున్నారని భావిస్తున్న షబ్బీర్ అలీని టార్గెట్ చేశారనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. హుజూర్ నగర్ ఉపఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయంలో, అలాగే ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ప్రగతిభవన్ ముట్టడి కార్యక్రమాన్ని ప్రకటించడంలో రేవంత్ వ్యవహార శైలిపై వీహెచ్ తోపాటు కొందరు సీనియర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఉప్పు నిప్పులా ఉండే రాష్ట్ర కాంగ్రెస్‌‌‌‌ నేతలను హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌ ఉప ఎన్నిక ఏకం చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలే కాదు.. రాష్ట్ర కాంగ్రెస్‌‌‌‌ నేతలు కూడా విభేదాలను వీడి ఐక్యంగా పనిచేశారు. అభ్యర్థి ఎన్నికపై విభేదాలు కనిపించినప్పటికీ వారంతా ఒక్కటయ్యారు.  ఉపఎన్నికల ఫలితాల అనంతరం మళ్లీ ఎవరికి వారే అన్నట్లుగా విడిపోయారని తెలుస్తోంది.