NewsOrbit
వ్యాఖ్య

చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా..!

బలహీనమైన జీవులు, జాతులు అంతరించిపోతాయి. బలమైనవి ఆ స్థానాన్ని ఆక్రమించుకుంటాయి. ఇంగ్లీషువాడిని తరిమికొట్టినంత మాత్రాన మనం సర్వస్వతంత్రులమైపోయామని అనుకుంటే అంతకుమించిన బుద్ధితక్కువతనం ఏముంటుంది? ఇప్పుడిక ఇంగ్లీషా? తెలుగా? అని తెగ వాదించుకొని లాభం ఏముంది? ఇప్పటికే ఒక జనరేషన్ తెలుగు చదవడం ఆపేసింది. మాటల్లో తెలుగు మిగిలింది కాబట్టి సినిమాలు టీవీలూ నడుస్తున్నాయి. అవి కూడా కొంత కాలానికి కింద ఇంగ్లీషు సబ్ టైటిల్స్ వేసుకుని నడుస్తాయి. అదీ  కొంత కాలమే అనుకోండి. ఇప్పుడింతగా గింజుకుని మాత్రం సాధించేది హేమీ లేదని నా మనవి.

నిజమే పిల్లవాడి మెదడు మాతృభాషలో సంపూర్ణంగా వికసిస్తుంది. పిల్లల్లో సృజనాత్మకత మాతృభాషలో మొదలవుతుంది నిజమే. భాషా శాస్త్రవేత్తలు, మానసిక శాస్త్రవేత్తలు, చారిత్రక సామాజిక పరిశోధకులు ఇదే విషయాన్ని చెప్పారు నిజమే. ఇదంతా ఇప్పుడు అవసరమా చెప్పండి? ఇంగ్లీషు చదివితే అడుగు బడుగు బలహీన వర్గాల పిల్లలు ఆకాశాన్ని అందుకుంటారని ఆశపడుతున్న సంకుల సందర్భం ఇది. ఇంగ్లీషులో చదువుకుని అగ్రవర్ణాల పిల్లలు అందలాలు ఎక్కారు కదా మన పిల్లలకూ ఆ అవకాశం వద్దా అని వాదించే వారికి సమాధానాలేం చెప్తాం?  మాతృభాషలో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించినవారు అనేకం అని అనేకమందిని ఉదాహరణలుగా చూపించవచ్చు అది ఓకే. అలాంటి తెలివైన పిల్లల గురించి కాదు, అవకాశాలకు దూరంగా ఉండిపోయిన సామాన్యుల  బిడ్డల మాటేమిటంటారు.  అప్పుడు నోరు మూసుకోవాలి కదా.   రష్యా జర్మనీ జపాన్ చైనా ఫ్రాన్స్ ఇటలీ లాంటి అనేకానేక దేశాలు తమ మాతృభాషలోనే  విజయాలు సాధిస్తున్న వివరాలు కోకొల్లలుగా ఇవ్వవచ్చు. కాలక్రమంలో ఆర్థికంగా  బలమైన స్థానంలో ఉండి తమ ఉనికిని కాపాడుకున్న జాతులు అవి. వాటి గొడవ మనకెందుకబ్బా అంటారు. నిజమే మరి.

ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటే. తెలుగు భాష ఎన్నాళ్ళకి అంతరించిపోతుందో ఒక అంచనాకి రావొచ్చని సంబరపడిపోవడమే. మనకి ఒక జాతీయ విద్యావిధానం చావలేదు. యావత్తు ప్రజోపయోగ సంస్థలనీ ప్రయివేటుపరం చేస్తూ వస్తున్న పాలక వర్గాలకు వారికి దక్కే ముడుపులు తప్ప ప్రజలకు దక్కే అవకాశాల అజే లేదు. నేను నవోదయ విద్యాలయాల్లో  కొన్నాళ్ళు పనిచేశాను. దేశవ్యాప్తంగా ఆ సంస్థల్లో ఆరో తరగతికి ఎంపిక జరుగుతుంది. మొత్తం దేశమంతా ఒకే సారి ఎంట్రన్స్ ఉంటుంది. అందులో త్రిభాషా సిద్ధాంతం అమల్లో వుంది. హిందీ ప్రాంతంలో హిందీలోనూ, ఇతర భాషా ప్రాంతాల్లో వారి వారి మాతృభాషల్లోనూ ఎనిమిదో తరగతి వరకూ బోధన సాగుతుంది. అయితే ఈ మూడేళ్ళలో పిల్లలకు ఇంగ్లీషు మీడియంను క్రమంగా పరిచయం చేస్తూ వస్తారు.  తొమ్మిదో తరగతి వచ్చేసరికి పూర్తి ఆంగ్ల మాధ్యమంలో బోధన పన్నెండో తరగతి వరకూ సాగుతుంది. ఏ మాధ్యమం నుంచి వచ్చినా పిల్లలు నవోదయ బోధనా పద్ధతులకు  చాలా త్వరగా అలవాటుపడిపోతారు. నవోదయ వెలసిన ఈ పాతిక ముప్పయ్యేళ్ళలో దేశ వ్యాప్తంగా ఐఏఎస్ లు, ఐపిఎస్ లు, ఐఐటీలు, డాక్టర్లు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు వేలల్లో లక్షల్లో విజయాలు సాధించారు.  అయితే దక్షిణాది నవోదయ స్కూళ్ళలో మూల సిద్ధాంతానికి గండికొట్టి ఆరోతరగతి నుంచే ఇంగ్లీషు మాధ్యమాన్ని బలవంతంగా రుద్దడం మొదలు పెట్టారు. దానికీ పిల్లలు ట్యూనవుతున్నారు. హిందీ ప్రాంతాల్లో ఇప్పటికీ పాత పద్ధతి కొనసాగిస్తున్నారు. పిల్లల ఎదుగుదలకి కాని, అవకాశాలు అందుకోవడానికి గానీ  ఎక్కడా ఇబ్బందులు ఎదురవ్వడం లేదు. నేను తెలుసుకున్నదేమంటే నాణ్యమైన విద్యాబోధన, వసతులు ఎక్కడుంటాయో అక్కడ భాష పెద్దగా అవరోధం కాదు. కానీ తెలివైన వారే ఎక్కడైనా గొప్పవిజయాలు సాధిస్తారు. సామాజికంగా వెనకబడిన వాతావరణం నుండి వచ్చిన వారికి ముందున్న వారిని అందుకోడానికి ఊతం ఇచ్చే సమస్త హంగులతో బడులుండాలి. ఇక్కడ ఆలోచించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.

పిల్లలకు ఇంగ్లీషులో బోధన సరే. వారికి బోధించే వారు రెండు భాషల్లో నేర్పరులై వుండాలి. ఉన్నారా? అందుకు తగిన శిక్షణతో పాటు పిల్లలకంటే ఎక్కువగా ఉపాధ్యాయులు కష్టపడడానికి సిద్ధంగా వుండాలి. అలా వారిని ఉంచే చర్యలేమైనా చేపట్టారా? కనీసం ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ఎలాంటి విద్యా పద్ధతులు ఉన్నాయో పరిశీలించారా? ఇంగ్లీషే కాదు, జర్మనీ, చైనీస్, జపనీస్ ఏ భాషనైనా నేర్పించే శాస్త్రీయ పధ్ధతి, అందుకు అనువైన పరిస్థితులు ఉంటే చాలు పిల్లలు అల్లుకుపోతారు.  భాష విషయంలో మన పరాయీకరణ ఎన్నాళ్ళ నుంచో మొదలైంది. ఇప్పుడు ఒకే ఒక్క లాంగ్ జంప్ చేయమంటున్నాడు జగన్. దానికి సమాజాన్ని పూర్తి సిద్థంగా ఉంచడం నిర్ణయాలను తీసుకున్న ఏలికలదే బాధ్యత. బడుల్లో డ్ర్రాపవుట్లు ఆపే దమ్ము, సంపూర్ణ అక్షరాస్యత  సాధించే నిజాయితీ ఎంతమంది పాలకుల్లో చూశాం? ఇలాంటి ప్రాధాన్యతలను నిర్లక్ష్యం చేయడం వల్ల జరిగిన నష్టం ఏమిటో  మనకు తెలియదా? కేవలం భాష వల్లనే సర్వతోముఖాభివృద్ధి జరగదు. సమూలమైన మార్పు కోసం నడుంకట్టే వారు అనివార్యమైన లక్ష్యాలను అశ్రద్ధ చేయకూడదు. అలా ఆశించడం మన కలేనేమో. అయినా  ఒకప్పుడు వేదాలకు మమ్మల్ని దూరంగా ఉంచారని వాపోయాం.  ఇప్పుడు నేర్చుకునే శక్తి ఉన్నా ఆ వేదజ్ఞానం కోసం ఎవరు వెంపర్లాడుతున్నారు? ఇంగ్లీషే సకలావకాశాలకు రహదారిగా భావించే రోజులివి. అలా ఆశపడుడతున్న వారిది భ్రమో..అదే నిజమో కాలమే చెప్పాలి.  ఈ  కలగాపులగపు సంధికాలంలో వెనకబడిన దేశాల, వెనకబడిన జాతుల, వెనకబడిన భాషల, వెనకబడిన సంస్కృతుల, సాహిత్యాల పయనాన్ని ఎవడూ నిర్దేశంచలేడు. జరిగే మార్పులను చూస్తూ వుండడమే మన పని.

ఏ మాటకామాటే  చెప్పుకోవాలి. చంద్రబాబు  పిల్లలైనా, జగన్ పిల్లలైనా, రామోజీ, కేసీయార్, ములాయం, లల్లూయాదవ్, సింధియా, శరద్ పవార్, రాజీవ్ గాంధీ…ఇలా ఎవరి పిల్లలైనా వారు చదివిన మీడియం కాదు, వారు పుట్టిన సంపన్న రాజకీయ ఆర్థిక నేపథ్యాలు వారి ఎదుగుదలకు కారణమవుతాయి. ఇంగ్లీషు మీడియంలో  చదివినంత మాత్రాన వారితో పాటు బలహీనుల పిల్లలు కూడా అంతే బలవంతులు కాలేరు. అలా జరగాలంటే పుట్టాల్సిన భూకంపం ఏమిటో ఎవరికి మాత్రం తెలియదు? అయితే  వారి కంపెనీలలో..వారి స్టార్ హోటళ్ళలో..వారి మాల్స్ లో..వారి హస్తగతమైన అనేకానేక  పబ్లిక్ సంస్థలలో.. కాల్ సెంటర్లలోనో..రిసెప్షన్సిస్టులుగానో, వెయిటర్స్ గానో..సేల్స్ గాళ్స్ – బాయ్స్ గానో..డ్రైవర్స్ గానో పనిచేయాలన్నా ఇంగ్లీషు ఇప్పుడు అనివార్యమే కదా. అందుకే ఇంగ్లీషుకిప్పుడు జై కొడదాం. తెలుగు భాష సంపూర్ణ దహన సంస్కారం జరిగే తీరుతెన్నులు   చూసి ప్రస్తుతానికి తరిద్దాం. అపారమైనది, అద్భుతమైనది అని మనం ఏ తెలుగు సాహిత్యాన్ని గురించి అయితే గొప్పగా పొగుడుకుంటున్నామో అది భవిష్యత్తులో రానున్న తరాలకు ఇంగ్లీషులో అందుబాటులో ఉంటుందో ఉండదో అని బెంగపడి మంచం పట్టొద్దు. అంతరించిపోయే భాషల జాబితాలో  ఎప్పుడో చేరిపోయామని, ఆ సహజ పరిణామంలో ఇది భాగమేనని ఆత్మబోధ చేసుకుంటే హాయిగా ఉండొచ్చు.  తమ భాషాసంస్కృతులు ఎలా దురాక్రమణకు గురయ్యాయో ఆఫ్రికన్ మహారచయిత చినువా అచిబే  థింగ్స్ ఫాల్ ఎపార్ట్ అనే గొప్ప  నవల రాశాడు. ఒకానొకప్పుడు మా పూర్వీకులు తెలుగు అనబడే భాష మాట్లాడేవారు, రాసేవారని మన ముందు తరాల   పిల్లలు రాస్తారేమో. అది ఊహించుకొని కాస్త ఊరట పొందుదాం.

 

 

డా.ప్రసాదమూర్తి

Related posts

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Saranya Koduri

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Allu Arjun: బన్నీ కి భారీ షాక్ ఇచ్చిన శ్రీ లీల… ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Venkatesh: వెంకీ మామా ఏంటి నీకు ఈ ఘోర అవ‌మానం… ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌..!

Saranya Koduri

Charmi: ” నీ హగ్గులు, లవ్ చాలా మిస్ అవుతున్నా.. తిరిగి మళ్లీ నా లైఫ్ లోకి రా “.. చార్మి సెన్సేషనల్ పోస్ట్..!

Saranya Koduri

Chiranjeevi: చిరు ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సీఎం కి కూడా ఈ రేంజ్ ఉండదేమో..!

Saranya Koduri

Balakrishna: బాల‌య్య ప‌క్క‌న ఆ హీరోయిన్… ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్రా బాబు..!

Saranya Koduri

Junior NTR: నందమూరి ఫ్యామిలీ తారక్ ని అందుకే దూరం పెడుతుందా.. బయటపడ్డ అసలు నిజం..!

Saranya Koduri

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Saranya Koduri

Samantha: జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను అంటూ మరోసారి తన ఆవేదనను బయటపెట్టిన సమంత..!

Saranya Koduri

నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ

Deepak Rajula

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment